
‘న్యాయ విచారణ కమిషన్ ఏర్పాటుకు డిమాండ్’
భువనేశ్వర్: రాష్ట్రంలో మహిళల రక్షణ, న్యాయం కోసం తక్షణ చర్యల్లో భాగంగా మహిళా న్యాయమూర్తి ఆధ్వర్యంలోని న్యాయ విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ ఆధ్వర్యంలో 8 మిత్రపక్ష పార్టీలతో కూడిన ప్రతినిధి బృందం రాష్ట్ర గవర్నర్‌కు అభ్యర్థించింది. మహిళలపై నేరాలకు కారణాలు, వ్యవస్థాగత వైఫల్యాలను పరిశోధించి 60 రోజుల్లో కమిషన్ నివేదిక సమర్పించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరింది. ఈ ప్రతినిధి బృందం గురువారం రాజ్ భవన్‌లో గవర్నర్ డాక్టరు హరి బాబు కంభంపాటిని కలిసి సమావేశమైంది. రాష్ట్ర పాలనలో పారదర్శకతతో ప్రజా విశ్వాసాన్ని కూడగట్టేందుకు పలు సంస్థాగత సంస్కరణలు చేపట్టడం అనివార్యంగా ప్రతినిధి బృందం పేర్కొంది. పోలీస్ వ్యవస్థలో రాజకీయ జోక్యాన్ని అంతమొందించడం ప్రధానమైనదిగా తెలిపారు.
ఒడిశా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నియామకం విస్మరించిన పరిస్థితిని తొలగించి దీర్ఘకాలంగా పేరుకుపోయిన పెండింగ్ ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలని ఉమ్మడి ప్రతినిధి బృందం అభ్యర్థించింది. పోలీస్ ఠాణాల్లో అత్యాచారం, లైంగిక నేరాల రికార్డుల కోసం ప్రత్యేక సెల్‌లు, ఆన్‌లైన్ ఎఫ్‌ఐఆర్ వ్యవస్థ, మహిళలపై క్రిమినల్ కేసులను 6 నెలల కాల పరిమితిలో పరిష్కారం, విపత్కర పరిస్థితుల్లో మహిళల తక్షణ రక్షణ కోసం టోల్–ఫ్రీ హెల్ప్‌లైన్‌వ్యవస్థని ప్రతిపాదించారు. మహిళలపై అత్యాచారాలు వంటి నేర సంబంధిత కేసుల్లో నిందితుల వ్యతిరేకంగా శిక్ష విధింపు రేటు నామ మాత్రంగా 8.3 శాతానికి పరిమితం అయిందని, ఈ పరిస్థితిని పటిష్టపరచాల్సి ఉందన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు భక్త చరణ్ దాస్ ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెసు ప్రముఖులు, డాక్టర్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, సంఘ్వీ జయంత్ దాస్, సురేష్ చంద్ర పాణిగ్రాహి, యుధిష్ఠిర్ మహాపాత్రొ, అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జ్యోతి రంజన్ మహాపాత్రొ, నేషనలిస్టు కాంగ్రెసు పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు విక్రమ్ స్వంయి, సమాజ్‌వాది పార్టీ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి ప్రతాప్ బారిక్, రాష్ట్రీయ జనతా దళ్ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి హేమంత్ కుమార్ రాష్ట్ర గవర్నరుని కలిసి వినతి పత్రం సమర్పించారు.