
మండీల్లో అక్రమాలపై ఫిర్యాదు
జయపురం: జయపురం సమితి జాముండ పంచాయతీలో ముత్యాలమ్మ స్వయం సహాయక గ్రూపు అక్రమాలకు పాల్పడుతోందని, వాస్తవ రైతుల నుంచి కాకుండా దళారుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తోందని జిల్లా కృషక మంచ్ రైతులు ఆరోపించారు. జిల్లా కృషక మంచ్ నేతృత్వంలో పలువరు జాముండ పంచాయతీ రైతులు గురువారం జయపురం సబ్‌కలెక్టర్ అక్కవరం శొశ్యా రెడ్డిని కలసి ఒక మెమొరాండం సమర్పించారు. అలాగనే డీఆర్ డీఎస్ భీమసేన్ సాహు, కలెక్టర్ వి.కీర్తి వాసన్‌లకు మెమొరాండంలు సమర్పించినట్లు తెలిపారు. జాముండ పంచాయతీలో మండీలో ధాన్యం కొనుగోలుకు, రైతులకు గుర్తింపు కార్డులను ఇచ్చే బాధ్యతను ముత్యాలమ్మ ఎస్‌హెచ్‌జీ గ్రూపునకు అప్పగించారని, ఆ గ్రూపును గ్రూపు కార్యదర్శి సుజాత పాణిగ్రహి, ఆమె భర్త బిద్యాధర కిశోర్ నిర్వహిస్తున్నారని, వారు మిగతా సభ్యులను విస్మరిస్తున్నారని ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. స్థానిక రైతులను విస్మరించి కుసుమి, పుట్ర, హడియ, కొంగ, ఖొయిరముండ, కుములిపుట్, జయంతిగిరి ప్రాంతాల రైతుల పేర్లు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. గ్రూపు వారికి బదులుగా రైతుల గుర్తింపు, ధాన్యం కొనుగోలు బాధ్యతలను కుములిపుట్ ల్యాంప్‌నకు అప్పజెప్పాలని కోరారు.