
తప్పని ప్రసవ వేదన
రాయగడ: జిల్లాలోని గుడారి సమితి పెండిలి పంచాయతీలోని పంచుపాండవ గ్రామంలో నివసిస్తున్న సంతొష్ సొబొరొ భార్య జొసమంతి సొబొరొ నిండు గర్భిణి. నెలలు నిండటంతో పురిటి నొప్పులతో బాధపడుతున్న ఆమెను గుడారి ఆరోగ్య కేంద్రానికి తరలించేందుకు అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అయితే పంచేపాండవ గ్రామానికి రోడ్డుకు మధ్య నది ఉండటంతో అంబులెన్స్ గ్రామానికి చేరుకోలేకపోయింది. దీంతో పురిటి నొప్పులతో బాధపడుతున్న నిండు గర్భిణిని సుమారు కిలోమీటరు దూరం వరకు ఉన్న నదిని దాటిస్తూ అంబులెన్స్ వరకు చేర్పించారు. నడవలేని స్థితిలొ ఉన్న ఆమెను కిలొమీటరు దూరం వరకు గల నదిని నాటించేందుకు గంట సమయం పట్టింది. ఓపికను కూడగట్టుకుని ఎంతో ప్రయాసపడి గర్భిణి అంబులెన్స్ వరకు చేరుకోగలిగింది. అనంతరం ఆమెను గుడారి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన బుధవారం మధ్యాహ్నం రెండు గంటల మధ్య చోటు చేసుకుంది. ఇలాంటి తరహా సంఘటనలు జిల్లాలో తరచూ జరుగుతున్నాయి. రహదారులు లేక నానా అవస్థలు పడి గర్భిణులను నడిపించుకుని తీసుకువస్తున్నారు.