
ప్రభుత్వ ఉద్యోగులు చేనేత దుస్తులు ధరించాలి
● ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి
భువనేశ్వర్: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు వారంలో ఏదో ఒక్కరోజు చేనేత వస్త్రాలు ధరించాలని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి విజ్ఞప్తి చేశారు. స్థానిక లోక్ సేవా భవన్ కన్వెన్షన్ సెంటర్‌లో శుక్రవారం తొలి ఒడిశా టెక్స్‌టైల్ సమ్మేళనం ప్రారంభోత్సవం పురస్కరించుకుని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఇది తూర్పు భారతదేశంలోనే అతిపెద్ద వస్త్ర సమ్మేళనంమని అభివర్ణించారు. ఈ సందర్భంగా జగత్‌సింగ్‌పూర్, భద్రక్‌లో 2 జౌళి, పాదరక్షల పార్కులను ముఖ్యమంత్రి ప్రజలకు అంకితం చేశారు. ఈ సమ్మేళనంలో సమగ్రంగా 33 అవగాహన ఒప్పందాలు (ఎంఓయూ) కుదిరాయి. దీంతో రూ.7808 కోట్ల పెట్టుబడి హామీ లభించింది. ఒప్పందం ప్రకారం రాష్ట్రంలో 53,300 ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఏటా క్రమం తప్పకుండా ఒడిశా టెక్స్‌టైల్ సమ్మేళనాన్ని నిర్వహిస్తామని ప్రకటించారు.
వస్త్ర పరిశ్రమలో పని చేసే వారి మజూరు నెలకు రూ.1,000 పెంచడంతో ఇక నుంచి మహిళా ఉద్యోగులకు రూ.6,000 బదులుగా నెలకు రూ.7,000, పురుష ఉద్యోగులకు రూ. 5,000 బదులుగా నెలకు రూ.6,000 చెల్లిస్తారు.
ఒడిశా పెట్టుబడిదారులకు ప్రధాన ఆకర్షణగా మారింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశంలోని సమగ్ర దేశీయ పెట్టుబడులలో 40 శాతం ఒడిశాకు రావడం గర్వకారణం. పారిశ్రామిక వర్గాలు ప్రభుత్వం పట్ల కూడగట్టుకున్న నమ్మకాన్ని పదిలపరచుకోవడానికి నిబద్ధతతో కృషి చేస్తున్నట్లు వివరించారు.
ఒడిశా వస్త్ర పరిశ్రమ పురాతనమైనది. వస్త్రాలు, వస్త్రధారణతో మన సంస్కృతి, సంప్రదాయంతో ముడిపడి ఉన్నాయి. దేశ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన పశ్చిమ ఒడిశా సంబల్‌పురి, బరంపురం పట్టు తదితర జౌళి ఉత్పాదనలు తార్కాణంగా పేర్కొన్నారు. వీటిని ప్రోత్సహించి ఒడిశాను వస్త్ర హబ్‌గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రంలో వస్త్ర రంగంలో 5 లక్షలకు పైగా ఉద్యోగాలను సృష్టించి రానున్న దశాబ్దంలో 5 వస్త్ర, దుస్తులు పార్కులను అభివృద్ధి చేయడం ప్రభుత్వ యోచన అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ముడి పదార్థాల లభ్యత, ఓడ రేవుల అనుసంధానంతో సహాయక కార్యశైలి ఒడిశా వస్త్ర , దుస్తుల పెట్టుబడులకు అత్యంత ఆకర్షణీయమైన గమ్యస్థానాలలో ఒకటిగా మారిందని రాష్ట్ర చేనేత, జౌళి, హస్తకళల మంత్రి ప్రదీప్ బాల సామంత అన్నారు. రాష్ట్ర చేనేత వారసత్వాన్ని బలోపేతం చేసే దిశలో ప్రభుత్వం నిబద్ధతతో కృషి చేస్తుందన్నారు.

ప్రభుత్వ ఉద్యోగులు చేనేత దుస్తులు ధరించాలి