
రాయగడ: రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లో గల చంద్రశేఖర్‌పూర్ పోలీసులు చంద్రశేఖర్‌పూర్ సమీపంలో గల ఒక అద్దె ఇంటిలో ఒక యువతి మృతదేహాన్ని గురువారం సాయంత్రం స్వాధీనం చేసుకున్నారు. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న యువతి మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టంకు తరలించారు. మృతురాలిని జిల్లాలోని కాశీపూర్ సమితి గొరఖ్‌పూర్ ప్రాంతానికి చెందిన అనుపమ నాయక్ (24)గా పోలీసులు గుర్తించారు. అనంతరం మృతురాలి కుటుంబానికి పోలీసులు సమాచారం తెలిపారు. సమాచారం తెలుసుకున్న బాధిత కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.
అనంతరం తన కూతురు ఆత్మహత్య వెనుక ఏదో బలమైన కారణం ఉంటుందని దీనిపై దర్యాప్తు చేయాలని మృతురాలి తండ్రి జొయల్ నాయక్ చంద్రశేఖర్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దివ్యాంగురాలైన తన కూతురు చదువుకునేందుకు చంద్రశేఖర్‌పూర్ ప్రాంతంలో ఒక అద్దె ఇంటిలో ఉంటోంది. నాలుగు నెలలుగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తి తన కుమార్తెను బెదిరిస్తున్నాడని, ఈ సంగతిని ఆమె ఫోన్‌లో చెప్పిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన కూతురిని హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం.