యాదాద్రి భువనగిరి జిల్లా: కర్నూలు జిల్లాలో జరిగిన ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో సజీవ దహనమైన గుండాల మండలం వస్తాకొండూర్ గ్రామానికి చెందిన మహేశ్వరం అనూషారెడ్డి ఇంటి వద్ద కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. మహేశ్వరం విజిత, శ్రీనివాస్‌రెడ్డి దంపతులకు ఇద్దరు కూతుర్లే కావడంతో అల్లారు ముద్దుగా పెంచి ఉన్నత చదువులు చదివించారని బంధువులు పేర్కొన్నారు.
కూతుర్లే అండగా ఉంటారని ఆశించిన తమకు దేవుడు ఇంత పెద్ద శిక్ష వేశాడని అనూషారెడ్డి తల్లిదండ్రులు విలపించారు. చిన్నతనం నుంచి అనూషారెడ్డి తన తెలివితేటలతో తమకు వారసుడు లేడన్న ఆలోచన లేకుండా చేసిందని విలపిస్తున్న తీరును చూసి బంధువులు కంటతడి పెట్టారు. కాగా కాలిపోయిన మృతదేహాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు. మృతదేహాన్ని 48 గంటల తర్వాత కుటుంబ సభ్యులకు అందజేస్తామని అధికారులు తెలిపినట్లు బంధువులు చెప్పారు.


