
పాఠశాల ప్రహరీ వెనుక అస్థిపంజరం లభ్యం
భువనేశ్వర్: కటక్ జిల్లా బైదేశ్వర్ పోలీస్‌స్టేషన్ పరిధి కొలాపొత్తర్ గ్రామంలోని ఉన్నత పాఠశాల ప్రహరీ గోడ వెనుక మానవ అస్థిపంజరం గుర్తించారు. ఇది స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. పాఠశాల ఆవరణకు వెలుపల ఉన్న మర్రిచెట్టు వద్ద అస్థిపంజర అవశేషాలు స్థానికుల దృష్టికి వచ్చింది. ప్లాస్టిక్ దారంతో చుట్టిన కాగితంలో కట్టి ఇక్కడ పడేసినట్లు భావిస్తున్నారు. ఇటీవల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కాలక్రమేణా కాగితపు పొట్లాం చిరిగిపోయి పుర్రె మరియు ఎముకలు బయటపడ్డాయి. అవశేషాలను గమనించిన స్థానికులు బైదేశ్వర్ ఠాణాకు సమాచారం అందజేయడంతో పోలీసుల బృందం ఘటనా స్థలానికి చేరుకుని తదుపరి దర్యాప్తు కోసం అస్థిపంజరాన్ని స్వాధీనం చేసుకుంది. ఈ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. స్థానికులు ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అవశేషాలను శరీర నిర్మాణ అధ్యయనాల కోసం ఉపయోగించే మానవ శరీరానికి చెందినవా.. లేదా ఏదైనా దుశ్చర్య జరిగిందా అని నిర్ధారించడానికి ఫోరెన్సిక్ పరీక్షకు పంపుతామని పోలీసు అధికారులు తెలిపారు.