
ప్రాథమిక ఆరోగ్యం పరిశీలన
రాయగడ: జిల్లాలోని గుడారి సమితి డెప్పాగుడలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా అదనపు ముఖ్యవైద్యాధికారి డాక్టర్ మమత చౌదరి బుధవారం పరిశీలించారు. దీనిలో భాగంగా అక్కడి గ్రామస్తులతో సమావేశమయ్యారు. గత రెండేళ్లుగా ఈ ఆరోగ్య కేంద్రంలో వైద్యుడి పోస్టు భర్తీ కాకపోవడంతో చికిత్స కోసం వస్తున్న రోగులు నానా అవస్థలు పడుతున్నారని, అదేవిధంగా ఇతరత్రా సమస్యలు కూడా ఉన్నాయని ఆమె దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఆమె త్వరలో వైద్యుడి పోస్టు భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా ఆరోగ్య కేంద్రంలో మెరుగైన వైద్య సౌకర్యాలు అందేలా కృషి చేస్తామని హామీనిచ్చారు. అనంతరం ఆమె ఆరోగ్య కేంద్రం సిబ్బందితో సమావేశమై సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
మావోయిస్టుల డంప్ స్వాధీనం
కొరాపుట్: జిల్లాలోని జయపూర్ సబ్ డివిజన్ బొయిపరిగుడ సమితి రామగిరిలో 180వ బీఎస్‌ఎఫ్ బెటాలియన్ జవాన్లు మావోయిస్టుల డంప్ స్వాధీనం చేసుకున్నారు. కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో డంప్ బయటపడిందని వెల్లడించారు. గుప్తేశ్వరం పంచాయతీ శబరి నది సమీపంలో గుటాఘాట్ మీద పెద్ద రాయికింద ఈ డంప్ గుర్తించామన్నారు. దానిలో 27 జిలెస్టిక్స్ బయటపడ్డాయని పేర్కొన్నారు. వీటిని బీఎస్‌ఎఫ్ క్యాంప్‌కి తరలించారు. విచారణ అనంతరం బొయిపరిగుడ పోలీస్‌స్టేషన్‌కి తరలించనున్నారు.
ఎలుగుబంటి దాడిలో
వ్యక్తికి తీవ్రగాయాలు
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా మత్తిలి సమితి బురిడిగూఢ గ్రామంలో బుధవారం రాత్రి ఎలుగు దాడిలో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బురిడిగూఢ గ్రామంలో నివాసం ఉంటున్న చైతన్య నాయక్ అనే వ్యక్తికి బుధవారం రాత్రి సమీపంలోని పొలానికి వెళ్లాడు. రాత్రి 11 గంటలైనా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలం వైపునకు వెళ్లి చూడగా అక్కడ ఎలుగు దాడి చేయడం గమనించి వెంటనే ఆయనను మత్తిలి ఆరోగ్యకేంద్రానికి తరలించారు. గురువారం కొరాపుట్ జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు.
భారీ వర్షాలకు
కొట్టుకుపోయిన వంతెన
భువనేశ్వర్: పశ్చిమ ఒడిశాలో కుండపోత వర్షాలతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. నువాపడా జిలా సునాబెడా వన్యప్రాణుల అభయారణ్యంలో వంతెన కూలిపోవడంతో కీలకమైన ఆవలి ప్రాంతంలో గ్రామీణులకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సునాబెడా పంచాయతీ కొమనా మండలం సునాబెడా, గతిబెడా గ్రామాలను కలిపే తెంతులిఖుంటి కల్వర్ట్ కొట్టుకుపోయింది. దీంతో అనేక గ్రామాల మధ్య రవాణా వ్యవస్థ కుప్పకూలింది. ప్రత్యామ్నాయ మార్గం లేకపోవడంతో వైద్య, అత్యవసర సేవలు దూరం కావడం పట్ల బాధిత వర్గం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ పరిస్థితి పట్ల అధికారుల స్పందన కొరవడింది. కొట్టుకు పోయిన వంతెన పునరుద్ధరణ పనులు అగమ్య గోచరంగా పరిణమిస్తున్నాయి.

ప్రాథమిక ఆరోగ్యం పరిశీలన

ప్రాథమిక ఆరోగ్యం పరిశీలన

ప్రాథమిక ఆరోగ్యం పరిశీలన