
మలుపు తిరగనున్న మహానది జల వివాదం
భువనేశ్వర్: మహా నది జలాలపై ఇరుగు పొరుగు ఒడిశా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల మధ్య వివాదం దీర్ఘకాలంగా కొనసాగుతోంది. గత్యంతరం లేని పరిస్థితుల్లో అప్పటి బిజూ జనతా దళ్ ప్రభుత్వం ఉన్నత న్యాయ స్థానాన్ని ఆశ్రయించింది. రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థనపట్ల సానుకూలంగా స్పందించిన ఉన్నత న్యాయ స్థానం న్యూ ఢిల్లీ కేంద్రంగా మహా నది జలాల వివాద ట్రిబ్యునల్ ఏర్పాటుకు ఆదేశించింది. ఈ ట్రిబ్యునల్ అధీనంలో వివాదం విచారణ దశలో గింగుర్లు కొడుతుంది. త్వరలో ఈ కేసు విచారణ జరగనుంది. ఈ పరిస్థితుల్లో చత్తీస్‌గఢ్ ప్రభుత్వం సంప్రదింపులతో మహా నది జలాల పంపిణీ వివాదం కొలిక్కి రానుందని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి ప్రకటించారు. ఈ ప్రకటన పట్ల ప్రధాన విపక్షం బిజూ జనతా దళ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రజల జీవ నాడి మహా నది. ఈ నదీ జలాలు రాష్ట్ర ప్రజల బహుముఖ జీవన శైలితో ముడిపడి ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొనసాగుతున్న న్యాయ పోరాటానికి ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం తెర దించి అడ్డగోలు వ్యవహారానికి నడుం బిగిస్తుందా అని విపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సూటిగా ప్రశ్నించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో మహా నది జలాల పంపిణీ వివాద పరిష్కారంపై తీర్మానం తీసుకున్నట్లు ప్రకటించారు. కేంద్రం సహాయంతో ఛత్తీస్‌గఢ్‌తో చర్చలు జరుగుతాయని, కేంద్ర జల కమిషన్ సాంకేతిక సహాయంతో దీర్ఘకాలంగా కొనసాగుతున్న వివాదానికి తెర పడుతుందని ప్రకటించారు. ఈ నేపథ్యలో ఉభయ రాష్ట్రాల జలవనరుల విభాగం మంత్రుల మధ్య చర్చలు జరిగాయి. రెండు రాష్ట్రాల మధ్య ఉన్నత స్థాయి చర్చలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు.
ఈ విషయాన్ని పునరుద్ఘాటిస్తూ రాష్ట్ర అడ్వకేటు జనరల్ పీతాంబర ఆచార్య సోషల్ మీడియా ఖాతాలో సందేశం జారీ చేశారు. ఉభయ రాష్ట్రాల మధ్య పరస్పర ఒప్పందం ద్వారా సమస్యను పరిష్కరించడంపై దృష్టి కేంద్రీకరించామని వివరించారు. ఈ ప్రకటనలపై నవీన్ పట్నాయక్ కొన్ని కీలకమైన సందేహాల్ని లేవనెత్తారు. రాష్ట్ర ప్రజలకు సంతృప్తికర వివరణ ఇచ్చి తదుపరి కార్యాచరణకు ఉపక్రమించాలని హితవు పలికారు. ఏ ప్రాతిపదికన చత్తీస్‌గఢ్‌లోని బీజేపీ ప్రభుత్వంతో రాజీని పరిశీలిస్తున్నారో వివరించడానికి రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం అత్యవసరంగా అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.
మహా నది జల వివాదాల ట్రిబ్యునల్ ముందు కేసు విచారణ ఆగస్టు 2న జరగనుంది. కీలకమైన విచారణ చేరువలో పరస్పర ఒప్పందం కోసం రాష్ట్ర ప్రభుత్వం పావులు కదపడం ప్రభుత్వం చట్టపరమైన పోరాటం నుంచి వైదొలగుతన్న సంకేతాల్ని బలపరుస్తుందని వేలెత్తి చూపారు. ఈ చర్యలు ఒడిశా నీటి హక్కులను దెబ్బతీసేలా తారసపడుతున్నాయి. వివాదస్పద పరిస్థితుల్లో ప్రభుత్వం వాటాదారులు, రాజకీయ పార్టీలు, ప్రజల విశ్వాసం కూడగట్టుకోకుండా చత్తీస్‌గఢ్ బీజేపీ ప్రభుత్వంతో రహస్యంగా ఒప్పందం కుదుర్చుకుంటుందా అని సందేహం లేవనెత్తారు. ఈ విషయంలో పూర్తి పారదర్శకత, జవాబుదారీతనంతో ప్రభుత్వం వ్యవహరించాలన్నారు.
అంతర్ రాష్ట్ర నదీ జలాల వివాదం చట్టం కింద ఈ వివాదంపై తీర్పు ఇవ్వాలని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పూర్వాపరాలు పరిశీలించిన సుప్రీం కోర్టు 2018 సంవత్సరం జనవరి 23న కేంద్ర ప్రభుత్వాన్ని మహా నది జల వివాదాల ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించిందని నవీన్ పట్నాయక్ గుర్తుచేశారు. బీజేడీ స్థిరమైన ప్రయత్నాలు, బలమైన ప్రజా ఒత్తిడి చివరికి కేంద్ర మంత్రివర్గం ట్రిబ్యునల్ ఏర్పాటును ఆమోదించేలా చేసింది. తదనంతరం, ఈ ఆదేశాల ప్రకారం 2018 సంవత్సరం మార్చి 12న కేంద్ర ప్రభుత్వం అధికారికంగా న్యూ ఢిల్లీలో మహానది జల వివాదాల ట్రిబ్యునల్ ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసింది. దీర్ఘకాలంగా కొనసాగిస్తున్న చట్టపరమైన పోరాటం నీరుగార్చి ప్రభుత్వం అకస్మాత్తుగా పరస్పర రాజీని అన్వేషించడం రాష్ట్ర ప్రజల ప్రగాఢ విశ్వాసాన్ని నిలువునా నీట గలిపినట్లే అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆగ్రహించిన విపక్షం
అఖిల పక్ష సమావేశానికి ప్రతిపాదన