నీలగిరి అడవిలో ఆత్మహత్య
జయపురం: జయపురం సబ్‌డివిజన్ బొరిగుమ్మ పోలీసు స్టేషన్ పరిధిలో గల నీలగిరి అడవిలో ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం ఉదయం కొంత మంది గ్రామస్తులు నీలగిరి అడవిలో ఒక చెట్టుకు గావంచాతో ఉరిపోసుకొని ఉండటం చూచి బొరిగుమ్మ పోలీసులకు తెలియజేశారు. పోలీసులు సంఘటనా ప్రాంతానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి బొడొదుబులి గ్రామం సుకాంత గౌఢ(23) అని గుర్తించారు. వారి వివరణ ప్రకారం.. బొడొదుబులి గ్రామంలో నివిసిస్తున్న సుకాంత్ గౌఢ మానసిక రోగి అని, అతడు గత బుధవారం నుండి కనిపించటం లేదని గ్రామస్తులు తెలిపారు. శుక్రవారం బొడొదుబులి గ్రామానికి కిలోమీటరు దూరాన గల నీలగిరి అడవిలో ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. మృతుని తండ్రి పోలీస్‌స్టేషన్‌లో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయగా ఏఎస్‌ఐ చందన ప్రసాద్ మఝి దర్యాప్తు చేశారు. మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం పంపామని పోలీసులు తెలిపారు.
ట్రాక్టర్ బోల్తా–17 మందికి గాయాలు
మల్కన్‌గిరి: ట్రాక్టర్ బోల్తాపడిన ఘటనలో 17 మంది గాయపడ్డారు. ఈ సంఘటన మల్కన్‌గిరి జిల్లా కోరుకొండ సమితి నక్కమామ్ముడి పంచాయతీ బయ్యాపోడ ఘాటీ వద్ద శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో చోటుచేసుకుంది. కుడుములగూమ్మ పంచాయతీలో జరుగుతున్న వారపు సంతకు నిత్యావసర సరుకులు కొనుగోలు చేసుకోవడానికి స్థానికులు ట్రాక్టర్‌పై వస్తుండగా బయ్యాపోడ ఘాటీ వద్ద అదుపుతప్పి బోల్తా పడడంతో ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన 17 మందిని స్థానికుల సహాయంతో కుడుములగుమ్మ ఆరోగ్య కేంద్రానికి చికిత్స కోసం తరలించారు. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెనుప్రమాదం తప్పిందని.. లేకుండా పలువురు ప్రాణాలు కోల్పోయేవారని స్థానికులు తెలిపారు.
కోడిపందాల శిబిరంపై పోలీసుల దాడి
● మేక, ద్విచక్ర వాహనాలు స్వాధీనం
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి సమితి గౌడిగూఢ పంచాయతీలో నిర్వహిస్తున్న కోడిపందాల శిబిరంపై పోలీసులు ఆకస్మికంగా దాడులు చేపట్టారు. పందాలు నిర్వహిస్తున్నట్టు తెలుసుకొని ఎస్‌డీపీవో ఆదేశాల మేరకు శుక్రవారం రాత్రి మల్కన్‌గిరి ఐఐసీ రీగాన్ కీండో తన సిబ్బందితో దాడి చేశారు. అయితే పోలీసుల రాకను పసిగట్టిన నిర్వాహకులు అక్కడ నుంచి పరారయ్యారు. దీంతో పందాల్లో గెలిచే వారికి ఇవ్వటానికి తీసుకొచ్చిన మేక, ఏడు ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకొని మల్కన్‌గిరి స్టేషన్‌కు తరలించారు. నిందితులు స్వచ్ఛందంగా లొంగిపోతే మేకను ఇచ్చేస్తామని.. లేకపోతే కోర్టుకు తరలిస్తామని పోలీసు ఐసీ రీగాన్ కీండో అన్నారు. అప్పటి వరకు పోలీసుల సంరక్షణలో మేక ఉంటుందన్నారు.
వేసవి శిబిరం ప్రారంభం
మల్కన్‌గిరి: జిల్లా కేంద్రానికి సమీపంలోని చలాన్‌గూడ పంచాయతీ ప్రధాన్‌గూడ గ్రామంలో ఉన్న ఏకలవ్య ఆదర్శ పాఠశాలలో జిల్లా శిశు సంరక్షణ యూనిట్, జిల్లా అధికారుల సహకారంతో ఐదు రోజుల వేసవి శిబిరం శనివారం ప్రారంభించారు. హాస్టల్‌లో బయటకు వెళ్లలేని చిన్నారుల్లో చైతన్యం కోసం శిబిరం ఏర్పాటు చేశారు. శిబిరానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ వినోద్ పటేల్ హాజరయ్యారు. విద్యార్థులు జాతి నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులకు ఆటలపోటీలు నిర్వహించారు.
నీలగిరి అడవిలో ఆత్మహత్య


