
రెడీగా భవనాలు.. అయినా మీనమేషాలు
శ్రీకాకుళం: జిల్లా కేంద్రంలోని రిమ్స్ వైద్య కళాశాల ఆవరణలో పలు భవన నిర్మాణాలు పూర్తయినా సంబంధిత అధికారులు స్వాధీనం చేసుకోవడం లేదు. 200 మందికి సరిపడా హాస్టల్ భవనం నిర్మాణం పూర్తయి ఏడాదిన్నర అవుతున్నా రిమ్స్ అధికారులు ఇప్పటికీ భవనాన్ని స్వాధీనం చేసుకోలేదు. ఏపీ హెచ్‌ఎంహెచ్‌ఐడీసీ అధికారులు ఎన్ని సార్లు లేఖ లు రాసినప్పటికీ వసతి గృహ నిర్వహణకు అవసరమైన సామగ్రి లేదని తిరుగు టపాలో రిమ్స్ అధికారులు లేఖలు రాస్తున్నారు. ఈ భవనాలను ఇలాగే వదిలేయటంతో మరుగుదొడ్లు, వాష్ బేసిన్ల వద్ద బిగించి ఉన్న 300కు పైగా కుళాయిలు చోరీకి గురయ్యాయి. దీంతో సంబంధిత కాంట్రాక్టర్ లబోదిబోమంటూ భవనాన్ని స్వాధీనం చేసుకునే సమయంలో కుళాయిలను మరోసారి అమర్చుతానని తెలిపారు. రిమ్స్‌లో ఎంబీబీఎస్ విద్యార్థులు 650 మంది, పీజీ విద్యార్థులు 650 మంది, హౌస్ సర్జన్‌లు 150 మంది వరకు ఉన్నారు. వీరికి సరైన వస తి సౌకర్యం లేకపోవటం వల్ల 275 మంది ప్రైవేటు గా అద్దె గదుల్లో ఉంటూ చదువుతున్నారు. 275 మందిలో 117 మంది మహిళలు కాగా 158 మంది పురుషులు ఉన్నారు. పీజీ విద్యార్థుల సంఖ్య 180 మంది కాగా వీరిలో 115 మంది ప్రైవేటుగా అద్దె భవనాల్లో ఉండి చదువుతున్నారు. వసతి గృహాల్లో ఉన్నవారు కూడా ఒక్కో గదిలో 5 నుంచి 10 మంది వరకు ఉండి తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇవేమీ రిమ్స్ అధికారులకు పట్టడం లేదు.
క్యాంటీన్‌దీ ఇదే పరిస్థితి..
రిమ్స్ ఆవరణలో క్యాంటీన్ భవన నిర్మాణం కూడా పూర్తయి నాలుగు నెలలకు పై బడుతుంది. దీన్ని కూడా రిమ్స్ అధికారులు స్వాధీనం చేసుకోలేదు. ఎవరికి వారు తమకెందుకులే అనే పద్ధతిలో ఉన్నా రు. హాస్టల్స్‌లో భోజనాలు సరిగా లేవన్న పంచాయతీ కలెక్టర్ వరకు వెళ్లిన విషయం పాఠకులకు తెలిసినదే. కనీసం క్యాంటీన్ ఉన్నా అక్కడైనా భోజ నం చేసుకుంటామని విద్యార్థులు భావిస్తున్నారు.
కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు
రిమ్స్ అధికారులు కలెక్టర్ ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తున్నారు. ఇటీవలి రిమ్స్‌లో పర్యటించిన కలెక్టర్ తాగునీటి ఆర్వో ప్లాంట్, లిఫ్ట్‌లు పనిచేయకపోవటాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఈ విషయాలను తనకు ఎందుకు తెలియజేయలేదని అధికారులపై మండిపడ్డారు. మరమ్మతులు చేపట్టాలని సూచించి రెండు నెలలు దాటుతున్నా పట్టించుకోలేదు. సలహా మండలి సమావేశాలు కూడా నిర్వహించటం లేదు. ఉన్నత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి.
పూర్తయిన భవనాలు స్వాధీనం చేసుకోని రిమ్స్ అధికారులు
వసతికి ఇబ్బంది పడుతున్న విద్యార్థులు
క్యాంటీన్ లేక అవస్థలు
సమస్యల పరిష్కారానికి చర్యలు
రిమ్స్‌లో ఉన్న సమస్యలు అన్ని వర్గాల వారి నుంచి తెలుసుకుంటున్నాను. ఇటీవలే బాధ్యతలు స్వీకరించాను. అన్ని సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తాను.
– డాక్టర్ అమూల్య, సూపరింటెండెంట్, రిమ్స్ ఆస్పత్రి, శ్రీకాకుళం