
కడుపులో కణితి ఉంటే.. గర్భవతని చెప్పారు
రాయగడ: ఒక మహిళ గర్భంలో కణితి పెరుగుతూ ఉంటే.. ఆమె గర్భవతి అని నిర్ధారించి కాశీపూర్ వైద్యులు చికిత్స అందించారు. కాశీపూర్ సమితి పరిధిలో గల ఖురిగా గ్రామంలో కవిచంద్ర జొడియా, అతని భార్య రుని జొడియా సరజలు నివసిస్తున్నారు. ఆరు నెలల కింద రుని జొడియా తీవ్ర అస్వస్థతకు గురైంది. భర్త ఆశ కార్యకర్తను సంప్రదించగా ఆమె ప్రెగ్నెన్సీ పరీక్షలు చేసింది. కన్ఫర్మ్ కావడంతో గత ఏడాది డిసెంబర్ 27న కాశీపూర్‌లో గల పీహెచ్‌సీకి రునిని తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలను నిర్వహించిన వైద్యులు ఆమెను గర్భవతిగా గుర్తించి అందుకు అనుగుణంగా కాల్షియం, విటమిన్ అదేవిధంగా టీకాలను ఇస్తూ వచ్చారు. ఆమె పేరున మమత కార్డును (గర్భవతి మహిళకు ఇచ్చే కార్డు) కూడా మంజూరు చేశారు. ఈ నెల (మే) 3 వ తేదీన ఆమె పరిస్థితి విషమించడంతో భర్త వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇక్కడ వైద్యులు అన్ని పరీక్షలను నిర్వహించిన అనంతరం ఆమె గర్భవతి కాదని కడుపులో ట్యూమర్ పెరుగుతుందని తక్షణమే మెరుగైన వైద్య అందించాలని సూచించారు. అనంతరం ఆమెను కొరాపుట్ లొ గల సహీద్ లక్ష్మణ్ నాయక్ హస్పటల్‌కు తరలించారు. ప్రస్తుతం కొరాపుట్‌లో చికిత్స పొందుతున్న రుని పరిస్థితి విషమిస్తున్నా ఇంతవరకు ఆమెకు ట్యూమర్‌కు సంబంఽధించిన ఎలాంటి ఆపరేషన్‌ను చేయలేదని ఆమె భర్త కవిచంద్ర తెలిపారు. వైద్య శాఖ అధికారులు స్పందించి తన భార్యను కాపాడాలని కోరుతున్నాడు.
కాశీపూర్‌లో వైద్యుల నిర్వాకం