
అర్హులందరికీ రేషన్‌కార్డులు
● రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి
కృష్ణచంద్ర పాత్రో
● రాయగడలో పలువురికి కార్డుల పంపిణీ
రాయగడ: అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని రాష్ట్ర పౌరసరఫరాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి కృష్ణచంద్ర పాత్రో అన్నారు. జిల్లాలో శుక్రవారం డీఆర్‌డీఏ సమావేశ మందిరంలో లబ్ధిదారులకు రేషన్‌కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలి విడతగా రాష్ట్రంలో 6 లక్షల మందికి కొత్తగా రేషన్ కార్డులను పంపిణీ చేసేందుకు సిద్ధం చేశామని చెప్పారు. పంచాయతీ దినోత్సవం నాడు జిల్లాల వారీగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. రేషన్ కార్డులు లేక ప్రభుత్వ పథకాలు పొందలేకపోతున్న ప్రజల దుస్థితిని గమనించిన ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి ఈ మేరకు చర్యలు తీసుకున్నారని చెప్పారు.
బోగస్ కార్డుల ఏరివేత..
అర్హులైన వారికి రేషన్ కార్డులు అందజేయడంతో పాటు దాదాపు 5 లక్షల బోగస్ రేషన్ కార్డులను ఏరివేసినట్లు మంత్రి చెప్పారు. వాటి స్థానంలో అర్హులైన వారిని గుర్తించి కొత్తగా రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. రేషన్ కార్డుల వల్ల సరుకులతో పాటు సుభద్ర, ఆయుష్మాన్ కార్డులు వంటి పథకాలను పొందవచ్చని పేర్కొన్నారు.
వ్యవసాయానికి పెద్దపీట..
రాష్ట్రం ఆర్థిక, సామాజిక రంగాల్లో పురోగతి చెందాలంటే వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలని, అందుకు అనుగుణంగా ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేస్తోందని మంత్రి తెలిపారు. రైతులను అన్ని విధాలా ప్రోత్సహిస్తామని చెప్పారు. సాగునీటి వనరులను మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని వివరించారు. త్వరలో సుమారు 15 లక్షల హెక్టార్ల భూములకు సాగునీరందించే విధంగా బృహత్తర ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు.
రైతులతో ముచ్చట్లు..
సదరు సమితి పరిధిలోని వీరనారాయణపురంలో పర్యటించిన మంత్రి పాత్రో ఆయా ప్రాంతాల్లో రైతులతో కాసేపు ముచ్చటించారు. అన్నదాతల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సాగునీటి వనరుల పనితీరుపై ఆరా తీశారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభి స్తున్నాయా అన్ని రైతులను ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రతి క్వింటాల్ ధాన్యానికి రూ.2300 మద్దతు ధర, ఇన్‌పుట్ సబ్సిడీ కింద మరో రూ.800 అందిస్తోందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం ఉత్తమ రైతు మాధవరావు సరక ఇంట్లో రాగిజావను ఆరగించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గోపి ఆనంద్, ఎస్సీ ఎస్టీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాళీరాం మాఝి, పార్టీ రాష్ట్ర శాఖ సభ్యుడు బసంతకుమార్ ఉలక, యాల్ల కొండబాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం స్థానిక బిజుపట్నాయక్ ఆడిటొరియంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి పాత్రోకు గజమాలతో సత్కరించారు.

అర్హులందరికీ రేషన్‌కార్డులు

అర్హులందరికీ రేషన్‌కార్డులు

అర్హులందరికీ రేషన్‌కార్డులు