
మందకొడిగా జగన్నాథ రథం తయారీ!
పర్లాకిమిడి: పూరీ పుణ్యక్షేత్రంలో జగన్నాథ రథాయాత్ర తరువాత పర్లాకిమిడిలోనే అతిపెద్ద రథాయాత్ర జరుగుతుంది. అయితే రథాయాత్రకు ఇంకా నెలరోజులే సమయం ఉండగా ఇప్పటివరకూ రథాల నిర్మాణం జరగలేదు. ఏటా జగన్నాథ, బలరామ, సుభద్ర రథాలు తయారు చేస్తున్నారు. ప్రస్తుతం జగన్నాథ ఆలయం వెలుపల పాత రథాల కలప, ఇరుసులు, జగన్నాథ రథ చక్రాలు బయటకు తీసు సిద్ధం చేశారు. రథాల తయారీకి వడ్రంగులు, పనివారు కొరత వల్ల ఇప్పటివరకూ నిర్మాణం జాప్యం జరుగుతున్నదని రథాయాత్ర కమిటీ సభ్యలు చెబుతున్నారు. జూన్ 27న రాష్ట్రంలో రథాయాత్ర పూరీ పుణ్యక్షేత్రంలో జరుగనున్నది.
జగద్గురు శంకరాచార్యులకు భద్రత పెంపు
భువనేశ్వర్: పూరీ గోవర్ధన పీఠాధిపతి పూజ్య జగద్గురు శంకరాచార్యులు స్వామి నిశ్చలానంద సరస్వతికి భద్రతా ఏర్పాట్లను మరింత బలోపేతం చేయనున్నారు. జగద్గురు భద్రత పెంపు ప్రాముఖ్యతను ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో చర్చించారు. స్థానిక లోక్ సేవా భవన్‌లో శుక్ర వారం ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పూరీ లోక్ సభ సభ్యుడు సంబిత్ పాత్రో, న్యాయ శాఖ మంత్రి పృథ్వీ రాజ్ హరిచందన్, శ్రీ మందిరం ప్రధాన పాలన అధికారి డాక్టరు అరవింద కుమార్ పాఢి తదితర ప్రముఖులు హాజరయ్యారు. పూరీ గోవర్ధన్ పీఠం పరిరక్షణ, మునుపటి ఆచార్యులందరి సమాధి స్థలాలను సంరక్షణ, పూజ్య జగద్గురువులకు భద్రతా ఏర్పాట్లు, పీఠ ప్రాంగణంలోని గోవర్ధన్ గోశాల అభివృద్ధి, మహ దధి తీరంలో సంధ్యా హారతి స్థల అభివృద్ధిపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. గోవర్ధన్ పీఠం పరిధీయ అభివృద్ధిపై నివేదికను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి పూరీ కలెక్టర్‌ను ఆదేశించారు. మహా దధి సంధ్యా హారతి స్థలిని మరింత ఆకర్షణీయంగా మలచి భక్తులు, యాత్రికులు, పర్యాటకులకు విశేషంగా ఆకట్టుకునే కేంద్రంగా తీర్చిదిద్దాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ సందర్భంగా పూరీ గోవర్ధన్ పీఠం అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలను అత్యంత ప్రాధాన్యతతో చేపడతామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
బరిగుడలో ఏనుగుల హల్‌చల్
రాయగడ: జిల్లాలోని బిసంకటక్ సమితి చాటికొన పంచాయతీ బరిగుడ గ్రామ సమీపంలో ఓ ఏనుగు హల్‌చల్ సృష్టిస్తోంది. గురువారం రాత్రి జనావాసాల్లోకి ప్రవేశించి మామిడి, అరటితోటలను ధ్వంసం చేసింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కొద్దిసేపటి తర్వాత రైలు మార్గాన్ని దాటి ఏనుగు అడవుల్లోకి వెళ్లిపోయింది. అయితే మళ్లీ తిరిగొస్తుందేమోనని గ్రామస్తులు బిక్కుబిక్కుమంటున్నారు.
చోరీ కేసులో యువకుడి అరెస్టు
● మరో ఐదుగురి కోసం గాలింపు
రాయగడ: జిల్లాలోని కళ్యాణ సింగుపూర్ సమి తి సికరపాయిలో ఇటీవల జరిగిన చోరీ కేసుకు సంబంధించి ఈశ్వర్ నాయక్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని విచారించగా చోరీ ఘటనలో మరో ఐదురుగు ఉన్నట్లు అంగీకరించాడు. దీంతో నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. సికరపాయిలో నివాసముంటున్న గొపాలశెఠి ఉపేంద్ర అనే వ్యక్తి ఇంట్లోకి మావోయిస్టులమని చెప్పి చొరబడిన దుండుగులు దంపతులపై దాడి చేయడంతోపాటు 14 తులాల బంగారం, రెండు క్వింటాళ్ల వెండి ఆభరణాలు చోరీ చేసి పరారయ్యారు. ఈ కేసుకు సంబంధించి కళ్యాణ సింగుపూర్ పోలీస్‌స్టేషన్ ఉన్నతాధికారి నీలకంఠ బెహర, ఎస్‌ఐ హేమంత్ కుమార్ బరిహ, ఎస్‌ఐ దిలిప్ మాఝి, కానిస్టేబుల్ కార్తీక్ సొబొరోలతో కూ డిన ప్రత్యేక బృందం దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలో సమితిలోని పూజారిగుడ గ్రామానికి వెళ్లే రహదారిలోని మామిడి చెట్టు వద్ద ద్విచక్ర వాహనాన్ని గుర్తించిన పోలీసులు దాని ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

మందకొడిగా జగన్నాథ రథం తయారీ!

మందకొడిగా జగన్నాథ రథం తయారీ!