
చారుమళ్ల కోసం తాటి మట్టలు విరాళం
భువనేశ్వర్: పూరీ శ్రీ జగన్నాథుని రథయాత్రలో అందరూ భాగస్వాములే. రథాల పైకి మూల విరాట్లు, ప్రతినిధి మూర్తులు ఎక్కించి దింపేందుకు తాత్కాలిక కాలి బాట ఏర్పాటు చేస్తారు. చారుమళ్లుగా వ్యవహరించే వీటి తయారీ కోసం తాటి మట్టలు వినియోగిస్తారు. ఈ ఏడాది 3 రథాల కోసం అవసరమయ్యే చారుమళ్ల తయారీకి తాటి చెట్లు విరాళంగా అందజేసేందుకు ఓ భక్తుడు స్వచ్ఛందంగా ముందుకు వచ్చాడు. భక్తుని ప్రకటన ప్రకారం సంప్రదించేందుకు శ్రీ మందిరం యంత్రాంగం తాటి చెట్లు లభ్యం అయ్యే ప్రాంతాన్ని ప్రత్యక్షంగా సందర్శించింది. ఈ సందర్భంగా రథాల చారుమళ్ల కోసం తాటి మట్టల దృఢత్వం పరిశీలించారు. దాతకు కృతజ్ఞతపూర్వకంగా శ్రీ మందిరం రత్న వేదికపై కొలువు దీరిన మూల విరాట్లకు నివేదించిన పొడి ప్రాదం అందజేసి ఉత్తరీయంతో సత్కరించి అభినందించారు.
ఢెంకనాల్ జిల్లా ఖడ్గ ప్రసాద్ ప్రాంతంలో ఉంటున్న విజయ్ సాహు ఈ ఏడాది రథ యాత్ర నిర్వహణకు అవసరమైన చారుమళ్ల తయారీకి అవసరమైన తాటి చెట్లు విరాళంగా అందజేశారు. శ్రీమందిర్ పాలన విభాగం అభివృద్ధి నిర్వాహకుడు, రథాల పర్యవేక్షకుడు, భోయ్ సర్దార్, మహరణ (వడ్రంగి) నిపుణులతో కూడిన సంయుక్త బృందం ఖడ్గ ప్రసాద్ గ్రామం సందర్శించి చెట్లను ఎంపిక చేసింది. అటవీ శాఖ సాయంతో వాటిని నరికి రవాణా ఏర్పాట్లు చేశారు. త్వరలో ఈ దూలాలు రథాల తయారీ ప్రాంగణానికి చేరనున్నాయి.

చారుమళ్ల కోసం తాటి మట్టలు విరాళం