
ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయాలి
భువనేశ్వర్: రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న పథకాల్ని సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి అధికారులను ఆదేశించారు. కుళాయి నీటి పథకం 100 శాతం పూర్తి చేయాలన్నారు. గురువారం ఖుర్దాలో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా యంత్రాంగంతో సమీక్ష నిర్వహించారు. ప్రజారోగ్యం, వ్యవసాయం, నీటి వనరులు, పర్యాటకం, మత్స్య సంపద, ఉద్యానవనం, పశుసంవర్ధకం, భూ సంరక్షణ, గ్రామీణ నీటి సరఫరాలో జరుగుతున్న ప్రగతిపై ఆరా తీశారు. జిల్లాలోని శాంతి భద్రతల పరిస్థితిని పరిశీలించారు. ఆయుష్మాన్ భారత్ – ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ, పట్టణ), ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన, ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన, ప్రధాన మంత్రి ముద్ర యోజన వంటి కీలకమైన కేంద్ర ప్రభుత్వ పథకాల పనితీరుపై సమీక్షించారు.
గవర్నరు సంతృప్తి..
సమీక్ష తర్వాత గవర్నర్ మీడియాతో మాట్లాడారు. ఖుర్ధా జిల్లాలో ప్రభుత్వ పథకాల అమలు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధాన్‌మంత్రి గ్రామ సడక్ యోజన కింద స్థిరమైన పురోగతిని ఆయన ప్రశంసించారు. జల్ జీవన్ మిషన్ కింద ప్రాజెక్టులను వేగవంతం చేయాల్సి ఉందన్నారు. దాదాపు 70 శాతం గృహాలకు కుళాయి ద్వారా నీటి సరఫరా జరుగుతోందన్నారు. వీలైనంత త్వరగా 100 శాతం పూర్తి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కొన్ని భారీ ప్రాజెక్టుల పని తీరు, పురోగతి పట్ల గవర్నరు అసంతృప్తి వ్యక్తం చేశారు. వీటిని సకాలంలో పూర్తి చేసేలా చొరవ తీసుకోవాలన్నారు. రాజధాని జిల్లాగా ఖుర్ధా ప్రాముఖ్యతను వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధికి ఈ జిల్లా పురోగతి ప్రామాణిక నిర్దేశించాల్సిన బాధ్యతను అధికారులు గుర్తించాల్సి ఉందన్నారు. జిల్లాలో ప్రస్తుతం 21 పారిశ్రామిక ఎస్టేట్‌లు పురోగతి దశలో ఉన్నాయని చెప్పారు. సూక్ష్మ, లఘు, మధ్య తరహా పరిశ్రమలను (ఎంఎస్‌ఎమ్‌ఈ) స్థాపించడానికి స్థలం అందుబాటులో ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఖుర్ధా జిల్లాలో అవకాశాలను అన్వేషించాలని, బలమైన మౌలిక సదుపాయాల లభ్యత, చురుకై న పరిపాలనా మద్దతు పట్ల ఔత్సాహికులను ప్రోత్సహించాలన్నారు. ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజనను పౌరులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర న్యాయ, నిర్మాణం, అబ్కారీ శాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్, ఖుర్ధా నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రశాంత్ జగదేవ్, ఏకామ్ర భువనేశ్వర్ ఎమ్మెల్యే బాబూసింగ్, ఖుర్ధా జిల్లా పరిషత్ అధ్యక్షురాలు రూపశ్రీ రాణి గుమాన్‌సింగ్, కలెక్టర్ చంచల్ రాణా, ఎస్పీ సాగరిక నాథ్ తదితరులు పాల్గొన్నారు.
గవర్నర్ కంభంపాటి హరిబాబు
అధికార యంత్రాంగంతో సమీక్ష