కాశీబుగ్గ: పలాస రైల్వేస్టేషన్ సమీపంలో గంజాయి తరలిస్తూ ఒక యువకుడు సోమవారం పట్టుబడినట్లు సీఐ సూర్యనారాయణ వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా ఆర్.ఉదయగిరి బ్లాక్, సబరాపల్లికి చెందిన ఆమద్ ఆనంద్ సోమవారం ఉదయం 10 గంటలకు గంజాయితో పట్టుబడ్డాడు. స్వగ్రామం నుంచి పలాస రైల్వేస్టేషన్ వరకు తరలించేందుకు రూ.3 వేలకు ఒప్పందం కుదుర్చుకుని, పలాస రైల్వేస్టేషన్ రన్నింగ్ రూం పక్కరోడ్డులో నడుచుకుంటూ స్టేషన్‌లోకి వచ్చే సమయంలో పోలీసులను చూసి రెండు బ్యాగులు వదిలి ఇద్దరు వ్యక్తులు పరుగులు పెట్టారు. దీంతో పోలీసులు వెంబడించగా నిఖిల్ పాని తప్పించుకోగా, ఆమద్ అనంద్ పోలీసులకు పట్టుబడ్డాడు. అతడి వద్దనుంచి 21.7 కేజీల గంజాయి, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అమ్మకందారులు, మధ్యవర్తులు మరో ఇద్దరు ఉన్నట్లు తెలిపారు.