దుర్గమ్మకు స్వర్ణ కిరీటం | - | Sakshi
Sakshi News home page

దుర్గమ్మకు స్వర్ణ కిరీటం

Oct 16 2026 10:40 AM | Updated on Oct 16 2026 10:40 AM

దుర్గమ్మకు స్వర్ణ కిరీటం ముగిసిన ఎన్‌డీఆర్‌ఎఫ్‌ ప్రాంతీయ పోటీలు మూలా నక్షత్రాన పకడ్బందీ ఏర్పాట్లు

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): శరన్నవరాత్రి ఉత్సవాల వేళ శ్రీకాకుళం పట్టణానికి చెందిన కుటుంబం గురువారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు బంగారు కిరీటం కానుకగా సమర్పించింది. రూ.75 లక్షలతో ఎరుపు, నీలం, తెలుపు, పచ్చ రాళ్లతో సుందరంగా తయారు చేయించిన 494 గ్రాముల బరువు గల నవరత్న కచిత బంగారు కిరీటాన్ని శ్రీకాకుళానికి చెందిన భక్తుడు కూర్మినాయుడు, పద్మావతమ్మ దంపతుల కుమారుడు కె.దుర్గా శ్రీనివాస్‌ అమ్మవారికి సమర్పించారు. ఆలయ ఈఓ కె.శీనానాయక్‌, దసరా చీఫ్‌ ఫెస్టివల్‌ ఆఫీ సర్‌ వి.త్రినాథరావు సంయుక్తంగా ఈ కానుకను స్వీకరించారు. అనంతరం దాత కుటుంబ సభ్యులకు అంతరాలయంలో అమ్మవారి ప్రత్యేక దర్శనం కల్పించారు. వేద పండితులు ఆశీర్వచనం అనంతరం అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదాలను అందజేసి సత్కరించారు. దుర్గా శ్రీనివాస్‌ మాట్లాడుతూ దుర్గమ్మ దయవల్లే తాము ఈ కానుకను సమర్పించుకోగలిగామన్నారు. పవిత్ర శరన్నవరాత్రుల్లో అమ్మవారికి స్వర్ణ కిరీటం సమర్పించే భాగ్యం కలిగినందుకు ఆనందంగా ఉందన్నారు.

గన్నవరం రూరల్‌: నైపుణ్య అభివృద్ధి, సామర్థ్యాల మెరుగుదల లక్ష్యాలుగా పోటీలు నిర్వహించినట్లు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ అధికారులు తెలిపారు. మండలంలోని కొండపావులూరులో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ 10వ బెటాలియన్‌ ఆధ్వర్యంలో ఎస్టీఆర్‌ఎఫ్‌ దక్షిణ, దక్షిణ మధ్య జోన్‌ ప్రాంతీయ స్థాయిలో నిర్వహించిన పోటీల్లో తమిళనాడు ఎస్డీఆర్‌ఎఫ్‌ విజేతగా నిలిచింది. ఏపీ ఎస్డీఆర్‌ఎఫ్‌ రన్నరప్‌గా నిలిచింది. ఈ నెల 12 నుంచి 15 వరకూ నాలుగు రోజుల పాటు జరిగిన పోటీల్లో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళం, ఒడిశా ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు పాల్గొన్నాయి. ముగింపు కార్యక్రమం గురువారం జరగ్గా ఐజీ పోలీస్‌ ఆపరేషన్స్‌ సీహెచ్‌ శ్రీకాంత్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కమాండెంట్‌ ప్రసన్నకుమార్‌, కల్నల్‌ పి.ఎన్‌. రెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు.

ఇంద్రకీలాద్రి/వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): దసరా ఉత్సవాల్లో భాగంగా మూలా నక్షత్రం సందర్భంగా మూడు లక్షల మంది వరకు భక్తులు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టినట్లు ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ జి.లక్ష్మీశ తెలిపారు. నేడు అనుసరించాల్సిన ప్రణాళికపై గురువారం కొండ దిగువ భాగాన ఇరిగేషన్‌ మోడల్‌ గెస్ట్‌ హౌజ్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రంలో సీపీ ఎస్‌వీ రాజశేఖరబాబు, దేవదాయ శాఖ కమిషనర్‌ కె.రామచంద్రమోహన్‌, ఆలయ ఈఓ వి.కె.శీనానాయక్‌, స్థానాచార్యుడు విష్ణుభట్ల శివప్రసాదశర్మ తదితరులతో కలిసి కలెక్టర్‌ సమావేశమయ్యారు. వివిధ అంశాలపై చర్చించారు. తొలుత కలెక్టర్‌ హోల్డింగ్‌ పాయింట్లను, క్యూలైన్లను పరిశీలించారు. సమావేశం అనంతరం కలెక్టర్‌ లక్ష్మీశ మీడియాతో మాట్లాడారు. వర్షం కురిసినా భక్తులకు ఇబ్బందులు కలగకుండా దర్శనానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామన్నారు. భక్తుల రద్దీ పర్యవేక్షణకు 450 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. సాయంత్రం 4 నుంచి 4.30 గంటల మధ్యలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారన్నారు.

మరో 900 మందికి బాధ్యతలు..

పోలీస్‌ కమిషనర్‌ రాజశేఖరబాబు మాట్లాడుతూ మూలానక్షత్రం రోజు అదనంగా మరో 900 మంది పోలీస్‌ సిబ్బందికి బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. శుక్రవారం వీఐపీ పాస్‌లను రద్దు చేసినట్లు తెలిపారు. దేవదాయ శాఖ కమిషనర్‌ కె.రామచంద్రమోహన్‌ మాట్లాడుతూ మూలానక్షత్రం రోజున మూడు లక్షల మంది వరకు భక్తులు వచ్చే అవకాశముందన్నారు. వైదిక కమిటీ సభ్యులతోనూ చర్చించి భక్తులకు సంతృప్తికర అమ్మవారి దర్శనం లభించేలా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement