105, 1065 జీవోలు జారీ స్థానిక సంస్థల వేళ బాబు మార్క్ ట్రిక్స్ వైఎస్సార్ సీపీ హయాంలో విజయవాడ మేయర్‌గా, జెడ్పీ చైర్‌పర్సన్‌గా బీసీ మహిళలకు అవకాశం
గతంలో బీసీలకు అధిక ప్రాధాన్యమిచ్చిన వైఎస్సార్ సీపీ
బీసీలకు బాబు ద్రోహం
బూటకపు జీవోలవి..
ప్రత్యేక చట్టం చేయకుండానే బీసీలకు 34 శాతం రిజర్వేషన్లంటూ కట్టుకథలు
సాక్షి, విజయవాడ: ఎన్నికల వేళ మాత్రమే సీఎం చంద్రబాబుకు బడుగు, బలహీన వర్గాల ప్రజలు గుర్తుకు వస్తారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అంటూ స్థానిక సంస్థల వేళ ఆయన ఆడింది నాటకమని మరోసారి సుస్పష్టమైంది. బీసీల ఓట్ల కోసమే జీవోల కట్టుకథలు నడుతున్నారన్న విషయం సుప్రీంకోర్టు, హైకోర్టుల తీర్పులతో తేటతెల్లమైంది. కోర్టులు తిరస్కరిస్తాయని తెలిసినా చంద్రబాబు తన పంథా వీడలేదు. హైకోర్టులో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కుదరదని తేల్చి చెప్పినా.. జనాలను తన వైపు తిప్పుకోవడానికి సుప్రీంకోర్టును ఆశ్రయించినా అక్కడా తిరస్కరణకు గురవడంతో చంద్రబాబు కుట్రపూరిత రాజకీయాలు మరోసారి బట్టబయలయ్యాయి. 2024 ఎన్నికల వేళ 50 ఏళ్లు దాటిన బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు పింఛన్ పేరిట ప్రగల్బాలు పలికారు. అధికారంలోకి వచ్చి 28 నెలలు కావొస్తున్నా.. ఆ హామీని అమలు చేయకుండా అటకెక్కించారు.
రాజీవ్ రంజన్ నేతృత్వంలోని డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసిన చంద్రబాబు అందులోని వాస్తవాలను దాచి.. బీసీలకు 34 శాతం అంటూ రాగం అందుకున్నారు. ‘స్థానిక’ ఎన్నికల వేడి ఊపందుకున్న తరుణంలో బీసీ రిజర్వేషన్ల అంశం చంద్రబాబు కావాలనే తెరపైకి తెచ్చారు. ఆ వెంటనే మైండ్ గేమ్ మొదలెట్టారు. అందుకోసం పంచాయతీరాజ్ సంస్థల్లో 34 శాతం, పట్టణ స్థానిక సంస్థల్లో 33.33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో నంబర్లు 105, 1065 జారీ చేయించారు. వీటిని హైకోర్టు కొట్టివేయడంతో అంతటితో ఆగని చంద్రబాబు మళ్లీ సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలిపి మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా చూడాలని స్పష్టం చేసింది.
అలాగే 28 మంది బీసీలకు ఎమ్మెల్సీలుగా అవకాశమిచ్చి చట్టసభలకు పంపారు. ఎంపీపీలు 68 శాతం, మున్సిపల్ చైర్‌పర్సన్ పదవులు 53 శాతం, ఎంపీటీసీ సభ్యులు 41 శాతం, జెడ్పీటీసీ సభ్యులుగా 36 శాతం మంది బీసీలకు అవకాశమిచ్చారని గుర్తు చేసుకుంటున్నారు. విజయవాడ మేయర్‌గా బీసీ (నగరాలు) మహిళ రాయన భాగ్యలక్ష్మికి, జెడ్పీ చైర్‌పర్సన్‌గా బీసీ (గౌడ సామాజిక వర్గం) మహిళ ఉప్పాల హారికకు ఇచ్చి బీసీలపై నిజాయతీని చాటుకున్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో.. దుర్గగుడి చైర్మన్‌గా రెండుసార్లు కూడా బీసీలకే అవకాశమిచ్చిన ఇచ్చిన ఘనత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిది. ఇంకా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎంపీపీలుగా, జెడ్పీటీసీ సభ్యులుగా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అవకాశం కల్పించారు.
మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అధిక ప్రాధాన్యమిచ్చారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చేసిన నిర్ణయాన్ని సవాల్ చేస్తూ నాడు ప్రతిపక్షంలో ఉన్న ఇదే చంద్రబాబు తన అనుచరుడు బిర్రు ప్రతాప్ రెడ్డి ద్వారా కోర్టులో పిల్ వేయించి అడ్డుకున్నారు. అయినా మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బీసీలకు 2021లో స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతానికి మించి ఇచ్చి నిబద్ధతను చాటుకున్నారు. ఏకంగా 56 కార్పొరేషన్లకు చైర్మన్లుగా, రాష్ట్రంలోని 13 మేయర్ పదవుల్లో 9 బీసీలకు కేటాయించి ఏకంగా 69 శాతం వారికి ఇచ్చారు. 13 జిల్లా పరిషత్‌లకు ఏకంగా 6 బీసీలకు ఇచ్చి 46 శాతం, 11 రాజ్యసభ సీట్లకు నలుగురు బీసీలకే ఇవ్వడంతో పాటు 25 లోక్‌సభ స్థానాల్లో 11 మంది బీసీలకు టికెట్ ఇచ్చి చట్టసభలకు పంపించారు.
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఇచ్చిన హామీని చంద్రబాబు నిలబెట్టుకోలేదు. బీసీలకు ద్రోహం చేశారు. జగన్‌మోహన్‌రెడ్డి బీసీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, ఇప్పుడు అదే బీసీల రాజకీయ ప్రాతినిధ్యానికి భరోసా కల్పించడంలో ఎందుకు విఫలమైంది. బీసీ యువత ఎదగడానికి రిజర్వేషన్లు కీలకం. బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వారిని రాజకీయ అవసరాల కోసం మాత్రమే ఉపయోగించుకోవడం సమంజసం కాదు.
–దేవినేని అవినాష్,
వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు
గతంలో మహానేత వైఎస్సార్, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బీసీలను నెత్తిన పెట్టుకున్నారు. చంద్రబాబుకు ఎన్నికలప్పుడే బీసీలు గుర్తొస్తారు. బూటకపు జీవోలు తెచ్చి అభాసుపాలయ్యారు. మా నాయకుడు వైఎస్ జగనన్న బీసీలకు 34 శాతం కాదు.. 50 శాతం పదవులు ఇచ్చి రాజ్యాధికారం కల్పించారు. దుర్గగుడి చైర్మన్‌గా బీసీ వెనుకబడిన వర్గాలకు చెందిన మాకు రెండుసార్లు అవకాశం ఇచ్చింది మా నాయకుడే. హైకోర్టు, సుప్రీంకోర్టు కొట్టేస్తాయని తెలిసి కూడా చంద్రబాబు ఎన్నికల వేళ బీసీలకు రిజర్వేషన్ అంటూ నాటకం ఆడారు. బీసీలకు చేయాలనుకుంటే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపవచ్చు. కానీ నాటకం ఆడారు.
– కర్నాటి రాంబాబు,
దుర్గగుడి మాజీ చైర్మన్


