మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): మూలపాడులోని డాక్టర్ గోకరాజు లైలా గంగరాజు , ఏసీఏ క్రికెట్ మైదానంలో ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు ఆంధ్ర–కర్ణాటక జట్ల మధ్య రంజీ ట్రోఫీ మ్యాచ్ జరగనుంది. నాలుగు రోజుల పాటు జరిగే మ్యాచ్ కోసం ఇరు జట్లు ముమ్మరంగా సన్నద్ధమవుతున్నాయి. భారత స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ శుక్రవారం విజయవాడకు చేరుకున్నారు. రెండు జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. కర్ణాటక జట్టులో కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, కరుణ్ నాయర్ వంటి అనుభవజ్ఞులు ఉన్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేసింది.
ప్రేక్షకులకు ప్రవేశం లేదు
ఈ రంజీ ట్రోఫీ మ్యాచ్‌కు ప్రేక్షకులకు అనుమతి లేదని ఏసీఏ నిర్వాహకులు స్పష్టం చేశారు. మ్యాచ్ సజావుగా నిర్వహించడంతో పాటు భద్రతకు ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు శాఖ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. నిబంధనలను ఉల్లంఘించి మైదానంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తే పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని, ప్రేక్షకులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఏసీఏ సభ్యులు కోరారు.
రాష్ట్ర రైతు విభాగంకార్యదర్శిగా నాగిరెడ్డి
చిలకలపూడి(మచిలీపట్నం): వైఎస్సార్ సీపీ రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శిగా యర్కారెడ్డి నాగిరెడ్డిని నియమించారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు తాడేపల్లి కేంద్ర కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన నాగిరెడ్డిని రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శిగా నియమించారు.


