ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్ర కీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో నిర్వహించే నిత్యాన్నదాన కార్యక్రమానికి దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ రూ.2,00,116 విరాళం అందజేసినట్లు ట్రస్ట్ వైస్ చైర్మన్ దేవినేని సుధీర తెలిపారు. ఆమె శుక్రవారం దేవస్థానానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని విరాళాన్ని ఆలయ జూనియర్ అసిస్టెంట్ నరసింహకు చెక్కు రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా సుధీర మాట్లాడుతూ దసరా పండుగ సందర్భంగా కనకదుర్గమ్మ దేవస్థానంలో మాజీ మంత్రి దేవినేని నెహ్రూ పేరుపై ప్రతి సంవత్సరం భక్తులకు అన్నవితరణకు విరాళం అందజేస్తున్నామని తెలిపారు.
తెలంగాణ నుంచి అమ్మవారికి 10 పట్టుచీరలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దసరా మహోత్సవాలు పురస్కరించుకుని తెలంగాణ పద్మశాలి సంఘం, అఖిల భారత పద్మశాలి సంఘం ప్రతినిధులు శుక్రవారం పట్టుచీరలను సమర్పించారు. తెలంగాణ నుంచి విచ్చేసిన సంఘ ప్రతినిధులు ఆలయానికి చేరుకోగా ట్రస్ట్ బోర్డు సభ్యులు వారిని సాదరంగా స్వాగతం పలికారు. ఆలయ మర్యాదలతో వారికి అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం వారికి ప్రసాదాలను అందజేయగా, దేవస్థానానికి పట్టుచీర, పూజా సామగ్రిని సమర్పించారు. ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర నాయకులు బొద్దుల లక్ష్మణ్, కందగట్ల స్వామి మాట్లాడుతూ అమ్మవారి అలంకరణ నిమిత్తం నియమ నిష్టలతో 10 పట్టుచీరలను నేత నేసినట్లు పేర్కొన్నారు. తెలంగాణలోని పలు జిల్లాల నుంచి పలువురు పద్మశాలి కళాకారులు వీటిని సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. ఏఈవో ఎన్.రమేష్‌బాబుకు చీరలను అందజేశారు.
రెండు పోటులలో లడ్డూ తయారీ
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): దసరా ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారి లడ్డూ ప్రసాదం తయారీకి రెండో పోటుకు అనుమతినిస్తూ ఆలయ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ‘ఒక పోటులో 60 లక్షల లడ్డూలు సాధ్యమేనా..!’ శీర్షికతో ఈ నెల 6వ తేదీన ‘సాక్షి’ ప్రచురించిన కథనానికి దేవదాయ శాఖ కీలక అధికారులు స్పందించారు. వెంటనే రెండో లడ్డూపోటును ఏర్పాటు చేసి లడ్డూలను సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని దేవస్థానం మొత్తం 60 లక్షల లడ్డూలను తయారు చేయాలని భావించింది. ఈ నేపథ్యంలో దేవస్థానం కొత్తగా నిర్మించిన లడ్డూ పోటులోనే లడ్డూలను తయారు చేయాలని దేవదాయ శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఒక పోటులో 60 లక్షల లడ్డూలు తయారు సాధ్యం కాదని ఆలయ సిబ్బంది బహిరంగంనే పేర్కొన్నారు. అయితే ఈ విషయం దేవదాయ శాఖ కీలక అధికారులకు ‘సాక్షి’ కథనం ద్వారా తెలియడంతో బుద్దా వారి ఆలయం వద్ద ఉన్న పోటులో కూడా లడ్డూల తయారుకు అవసరమైన సరుకులను సిద్ధం చేస్తున్నారు. దీంతో దసరా ఉత్సవాలలో భక్తులందరికీ ప్రసాదం అందేలా శనివారం నుంచి లడ్డూ తయారీకి సిబ్బంది రంగం సిద్ధం చేస్తున్నారు.
బాలిక చేతిరాత వైరల్
ఇన్‌స్టాగ్రామ్‌లో 125 మిలియన్ వ్యూస్
హనుమాన్‌జంక్షన్‌రూరల్: బాపులపాడు మండలం సింగన్నగూడెంలోని సెయింట్ విన్సెంట్ హైస్కూల్ తొమ్మిదో తరగతి విద్యార్థిని సంజన చేతిరాత వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తరగతి గదిలో నోట్‌బుక్ రాస్తుండగా ఉపాధ్యాయుడు ఆమె హ్యాండ్ రైటింగ్‌కు ముగ్ధుడై వీడియా తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. కేవలం 24 గంటల వ్యవధిలో 100 మిలియన్ మంది నెటిజన్లు ఆమె వీడియో తిలకించారు. పలు జాతీయ డిజిటల్ న్యూస్ మీడియా చానళ్లలోనూ సంజన చేతిరాతకు ప్రశంసల జల్లు కురుపిస్తున్నారు. శుక్రవారం సాయంత్రానికి ఇన్‌స్టాగ్రామ్‌లో 125 మిలియన్ వ్యూస్ దాటడం విశేషం.


