తక్కువ బస్సులు.. తప్పని తిప్పలు | - | Sakshi
Sakshi News home page

తక్కువ బస్సులు.. తప్పని తిప్పలు

Oct 10 2026 2:04 AM | Updated on Oct 10 2026 2:04 AM

తక్కువ బస్సులు.. తప్పని తిప్పలు

దసరా ఉత్సవాలకు విజయవాడకు పెద్ద సంఖ్యలో రానున్న భక్తులు అదనపు బస్సు సర్వీసులు నడుపుతామన్న ఆర్టీసీ కాలం చెల్లి ప్రతి నెలా షెడ్డుకు చేరుతున్న బస్సులు 10కి పైనే వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో కొన్న బస్సులే దిక్కు ఆర్టీసీకి ఒక్క బస్సూ కొనుగోలు చేయని చంద్రబాబు ప్రభుత్వం

ఉచితమే.. శరాఘాతంగా మారిందా ?

సాక్షి, విజయవాడ: భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న బెజవాడ దుర్గమ్మను దసరా ఉత్సవాల్లో దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు విచ్చేస్తారు. మరో రెండు రోజుల్లో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. బస్సులు, రైళ్లు, ప్రైవేటు వాహనాల్లో భక్తులు విజయవాడకు చేరుకుంటారు. భక్తుల రద్దీ నేపథ్యంలో పది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు ప్రత్యేక సర్వీసులు నడుపుతామని ఆర్టీసీ చెబుతోంది. అయితే ప్రతి నెలా కాల పరిమితి దాటిన బస్సులను స్క్రాప్‌ కింద పక్కన పెడుతున్నారు. తక్కువలో తక్కువగా నెలకు 10 నుంచి 15 బస్సులు షెడ్డుకు చేరుతున్నాయి. వాటి స్థానంలో కొత్త బస్సులను తేవడం లేదు. ఉన్న వాటినే అటూ ఇటు తిప్పుతూ ఆర్టీసీ తంటాలు పడుతోంది. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో 1500 కొనుగోలుకు టెండర్లు పిలవగా ఎన్నికలకు ముందే సుమారు 400 బస్సులు రాష్ట్రవ్యాప్తంగా డిపోలకు చేరాయి. 2024లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఒక్కటంటే ఒక్క బస్సును కూడా కొనుగోలు చేయలేదు.

భక్తులకు తిప్పలే..

ఈ నెల 11వ తేదీ నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలతో పాటు విద్యార్థులకు దసరా సెలవులు కావడంతో ఆర్టీసీ ఈ ఏడాది 4,172 అదనపు ట్రిప్పులు (సర్వీసులు) నడిపేలా ఏర్పాట్లు చేసింది. గతేడాది 3,055 అదనపు ట్రిప్పులు నడపగా.. ఈ సారి మాత్రం రద్దీ భారీగా ఉండే నేపథ్యంలో 1,117 ట్రిప్పులు అదనంగా నడపనుంది. ముఖ్యంగా అమ్మవారి దర్శనం కోసం శ్రీకాకుళం, వైజాగ్‌, రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, ఒంగోలు, నెల్లూరు జిల్లాల నంచి అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. ఆయా జిల్లాలకు శుక్రవారం నుంచి 1055 అదనపు ట్రిప్పులు, శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిసిన తరువాత 200 ట్రిప్పులను ఆర్టీసీ అధికారులు నడపనున్నారు. గుంటూరు, మచిలీపట్నం, గుడివాడ, తెనాలి, ఏలూరు నుంచి 1883 (నాన్‌ స్టాప్‌) ట్రిప్పులు, పండుగ తరువాత 204 ట్రిప్పులు నడపనున్నారు. రాయలసీమ సెక్టార్‌కు ఈ సారి 126 అదనపు ట్రిప్పులు నడపనున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ, జగ్గయ్యపేట, పల్నాడు జిల్లా మాచర్ల, భీమవరం జిల్ల్లాకు శుక్రవారం నుంచి 653 అదనపు ట్రిప్పులు, సెలవుల అనంతరం 51 ట్రిప్పులు నడుస్తాయని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. పక్క రాష్ట్రమైన తెలంగాణ నుంచి భక్తులు ఈ నెల 16, 17, 18, 19 తేదీల్లో అధికంగా వచ్చే అవకాశం ఉండడంతో ప్రత్యేక సర్వీసులతో పాటు వీకెండ్‌లో అదనపు సర్వీసులు నడవనున్నాయి.

షెడ్యూల్‌ సర్వీసులే అదనపు ట్రిప్పులు

దసరా ఉత్సవాలు, సెలవుల సందర్భంగా ఆర్టీసీ ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక సర్వీసులకు జిల్లా పరిధిలో రోజూ తిరిగే షెడ్యూల్‌ సర్వీసుల నుంచే బస్సులను కేటాయించారు. ఉదాహరణకు విజయవాడ నుంచి జగ్గయ్యపేటకు వయా కంచికచెర్ల, నందిగామ మీదుగా 12 వరకు ఎక్స్‌ప్రెస్‌ బస్సులు షెడ్యూల్‌ ప్రకారం తిరుగుతాయి. ఇప్పుడు వీటిలోనే కొన్నింటిని ప్రత్యేక సర్వీసులుగా కేటాయిస్తారు. సాధారణంగానే జగ్గయ్యపేటకు ప్రయాణికుల రద్దీగా ఎక్కువ ఉంటుంది. వీటిలోనే తగ్గిస్తే మరింత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయని ఆర్టీసీ అధికారులకు తెలుసు. కానీ వీటినే కేటాయిస్తున్నారు. పల్లెవెలుగు బస్సులు కూడా ప్రత్యేక సర్వీసులుగా నడిస్తే ఉన్న బస్సుల సంఖ్య మరింత తగ్గుతుంది. దీంతో గ్రామీణ ప్రయాణికులకు ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

ఎలక్ట్రిక్‌ బస్సులెప్పుడు వస్తాయో ?

రాష్ట్రవ్యాప్తంగా 750కి పైగా ఎలక్ట్రిక్‌ బస్సులు ఆగస్టు నాటికే అందుబాటులోకి వస్తాయని చంద్రబాబు ప్రభుత్వం బీరాలు పలికింది. అందులోనూ రాజధాని ప్రాంతంగా ఉన్న విజయవాడకు అధిక బస్సులు కేటాయిస్తున్నట్లు చెప్పింది. ఎలక్ట్రిక్‌ బస్సుల కోసం విద్యాధరపురం డిపోను కేటాయించారు. సాధారణంగానే విజయవాడకు ప్రయాణికుల తాకిడి అధికం. పండిట్‌ నెహ్రూ బస్‌ స్టేషన్‌ నుంచి సెప్టెంబర్‌ 30వ తేదీ వరకు 551 ఆర్టీసీ బస్సులు, 148 అద్దె బస్సులు కలిపి మొత్తం 699 బస్సులు జిల్లాలో 2,61,213 కిలోమీటర్ల మేర తిరిగాయి. సరాసరి ప్రతి నెలా 10 నుంచి 15 వరకు బస్సులు షెడ్డుకు చేరుతున్నాయి. ప్రస్తుతం బస్సుల సంఖ్య 650. అంటే ఈ 9 రోజుల్లో 49 సర్వీసులు తగ్గిపోయాయి. మరి దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు అదనపు సర్వీసులు ఎలా నడుపుతారన్నది ప్రశ్నార్థకం. ఉన్న బస్సులనే అటు తిప్పి.. ఇటు తిప్పడం తప్ప ప్రత్యామ్నాయం లేదు. భక్తుల కోసం ప్రత్యేకంగా బస్సులు కొనుగోలు చేసి తిప్పడం లేదనే విషయం తేటతెల్లం అవుతోంది. అందులోనూ నాణ్యత లేని, పాత సర్వీసులనే అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం కేటాయిస్తున్నారని, గత రెండేళ్లు కూడా ఇలానే చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

దేశంలోనే అతిపెద్ద బస్టాండ్‌గా ఉన్న విజయవాడ పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌ నుంచి రోజువారీ రెండు లక్షల మంది వరకు, వారాంతంలో ఆ సంఖ్య 2.50 లక్షల మంది రాకపోకలు సాగిస్తారు. సీ్త్రశక్తి పథకం కారణంగా మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ పథకమే ఆర్టీసీకి శరాఘాతంగా పరిణమించిందని కొందరు ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక కాలపరిమితి దాటిన సర్వీసులు భారీగా షెడ్డుకు చేరాయి. మహిళలకు ఉచిత ప్రయాణం అని ఊదరగొట్టుకునే కూటమి ప్రభుత్వం ఆర్టీసీ సర్వీసులు తగ్గించి దగా చేస్తోంది. అరకొర బస్సుల్లో సామర్థ్యానికి మించి మహిళలు ప్రయాణిస్తుండటంతో డ్రైవర్లు, కండక్టర్లపై భారం అధికమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement