పటమట(విజయవాడతూర్పు): హత్య కేసులో నిందితుడికి న్యాయస్థానం జీవితఖైదు విధించింది. విజయవాడ పటమట పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆటోనగర్ బస్ టెర్మినల్ వద్ద 2021 డిసెంబర్ 25న ఈ హత్య ఘటన జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం గోసాలలో నివసించే జిలానీ, మస్తాన్‌లు నిందితుడైన కందవల్లి నాగ శేషు ఆటోలు నడుపుతూ జీవిస్తుంటారు. మస్తాన్ ఆటోను శేషు అద్దెకు తిప్పుకుంటూ ఉంటాడు. కొంత కాలంగా అద్దె డబ్బుల విషయంలో వారి మధ్య గొడవలు జరిగాయి. ఈ క్రమంలో తన భార్యను జిలానీ అసభ్యకరంగా మాట్లాడాడని శేషు కోపం పెంచుకున్నాడు. 2021 డిసెంబర్ 25వ తేదీన ఆటోనగర్ బస్ టెర్మినల్ సమీపంలో శేషు జిలానీతో గొడవ పడ్డాడు. వెంట తెచ్చుకున్న కత్తితో జిలానీ మెడ నరికాడు. చుట్టుపక్కల వారు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ జిలానీ మరణించాడు. సదరు ఘటనపై కేసు నమోదు చేసిన ఎస్.ఐ. జాన్ బాషా దర్యాప్తు చేయగా నాగ శేషును అదే నెల 28వ తేదీన అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరు పరచారు. ప్రాసిక్యూషన్ తరుపున అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్.జగదీష్, ప్రస్తుత ఇన్స్‌పెక్టర్ పవన్ కిషోర్, సి.యమ్.ఎస్. ఇన్‌స్పెక్టర్ జగదీశ్వరరావు, అప్పటి పటమట ఇన్స్‌పెక్టర్ సురేష్‌రెడ్డి. ఎస్.ఐ. జాన్ బాషా, సి.ఎం.ఎస్ సిబ్బంది పర్యవేక్షణలో 13 మంది సాక్షులను కోర్టులో విచారించారు. కేసులో కండవల్లి నాగ శేషుపై నేరం రుజువు కావటంతో శుక్రవారం 8వ అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి ఎన్.పద్మావతి నిందితునికి జీవిత ఖైదు రూ.2 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.


