స్పీకర్ ఓంబిర్లా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లకు ఆహ్వానం
సాక్షి, న్యూఢిల్లీ: విజయవాడలో ఘనంగా నిర్వహించనున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్ 2.0కు రావాలని లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్‌లను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని), మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆహ్వానించారు. ఈమేరకు శుక్రవారం ఢిల్లీలో స్పీకర్ ఓంబిర్లాను, లక్నోలో సీఎం యోగిని కలసి వేర్వేరుగా కలిసిన ఈ ఇద్దరూ వారికి ఆహ్వాన పత్రాలను అందచేశారు. ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మవారి సన్నిధిలో నిర్వహించే పవిత్ర దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనాలని వారు కోరారు. విజయవాడకు ఉన్న విశిష్ట ఆధ్యాత్మిక ప్రాధాన్యత, ఘనమైన సాంస్కృతిక వారసత్వాన్ని దేశవ్యాప్తంగా చాటిచెప్పే లక్ష్యంతో ఈ వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తి, సంప్రదాయాలు, కళలు, సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఈ ఉత్సవాల ద్వారా విజయవాడకు జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. ఉత్సవాల్లో ప్రముఖులు, భక్తులు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఎంపీ కేశినేని శివనాథ్ ఆకాంక్షించారు.
కృష్ణలంక(విజయవాడతూర్పు): దసరా ఉత్సవాల సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి విచ్చేసే భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ఎన్టీఆర్ జిల్లా పోలీస్, ట్రాఫిక్ పోలీస్ యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేసింది. భక్తుల సౌకర్యార్థం నగరవ్యాప్తంగా 40 పార్కింగ్ స్థలాలను, లైవ్ నావిగేషన్ సదుపాయాన్ని, భారీ వాహనాల కోసం ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేసినట్లు శుక్రవారం జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఆలయం లోపల, చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తం 40 పార్కింగ్ ప్రదేశాలు సిద్ధం చేశామన్నాని, ఆయా స్థలాల్లో వాహనాల రాకపోకలను పర్యవేక్షించేందుకు ఏఎన్‌పీఆర్ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. భక్తులు తాము వచ్చే ప్రాంతాన్ని/మార్గాన్ని బట్టి వాహనాలను కేటాయించిన పార్కింగ్ స్థలాల్లోనే నిలపాలని విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ డైవర్షన్ పాయింట్ల వద్ద ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి నేరుగా పార్కింగ్ స్థలానికి చేరుకోవచ్చని, పార్కింగ్ స్థలాల ఖాళీ స్థితి, సులువైన నావిగేషన్‌ను అస్త్రం సిటిజెన్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చని వివరించారు.
మూలా నక్షత్రం రోజు ప్రత్యేక మళ్లింపులు..
మూలా నక్షత్రం రోజున భక్తుల రద్దీని బట్టి కీలక కూడళ్లు కుమ్మరిపాలెం, లాడ్జి అవుట్ పోస్ట్, కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రవేశం, గద్ద బొమ్మ సెంటర్, పాత పోలీస్ కంట్రోల్ రూమ్ జంక్షన్‌లలో ట్రాఫిక్‌ను మళ్లింపులు ఉంటాయని సీపీ తెలిపారు. వాహనదారులు గమనించి, ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేందుకు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరారు.
భవానీపురం(విజయవాడపశ్చిమ): సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ఆధ్వర్యాన జిజ్ఞాస ఆర్ట్ వర్క్ నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవ్–2.0 కార్యక్రమంలో భాగంగా శుక్రవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మిసెస్ విజయవాడ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో మహిళలు తమ విభిన్న ప్రతిభతో ఆకట్టుకున్నారు. వివిధ రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే వస్త్రధారణతో అలరించారు. టాలెంట్ రౌండ్‌లో నృత్యం, సంగీతం, మిమిక్రీ, వెంట్రిలాక్విజం, యాంకరింగ్, థీమాటిక్ కాస్ట్యూమ్స్ తదితర విభాగాల్లో పోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన కేశినేని జానకి లక్ష్మి, బొండా సుజాత మాట్లాడుతూ మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే ఇటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అందాల పోటీలు కేవలం బాహ్య సౌందర్యానికి మాత్రమే పరిమితం కాకుండా వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత ప్రతిబింభించేలా ఉండాలని సూచించారు.


