ఎన్నికల అధికారి జ్ఞానేష్‌కుమార్ రాజీనామా చేయాలి కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు (ఈవీఎం)లు ట్యాంపరింగ్ జరిగిన మాట వాస్తవమేనని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ పేర్కొన్నారు. 150 లోక్ సభ స్థానాల్లో ట్యాంపరింగ్‌కు పాల్పడినట్లు ఆధారాలు ఉన్నాయన్నారు. ప్రతిపక్షాలు బలహీనంగా ఉన్న చోట ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయని ఆరోపించారు. శుక్రవారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో చింతా మోహన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేశారు. ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్‌కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్ట్‌లను ఆయన ఖండించారు. ఎన్నికల సంఘం బీజేపీ తొత్తుగా వ్యవహరిస్తోందన్నారు. రిజర్వేషన్ల విషయంలో చంద్రబాబు తీరును ఆయన తప్పుబట్టారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారన్నారు. రాజ్యాంగ సవరణ జరగనిదే రిజర్వేషన్ సాధ్యం కాదన్నారు. దళితులు దేవాలయాల్లోకి ప్రవేశించి వందేళ్లు పూర్తయిందన్నారు. ఈ సందర్భంగా ఈనెల 13న 33 మంది దళితులతో కలిసి తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకుని శతాబ్ది ఉత్సవాలు లాంఛనంగా ప్రారంభిస్తామన్నారు. ఏడాది పాటు దేశవ్యాప్తంగా దళిత దేవాలయ ప్రవేశ శతాబ్ది ఉత్సవాలు జరుపుతామన్నారు. సభలు, సమావేశాలు, చర్చ వేదికలు, సెమినార్లు నిర్వహిస్తామని ప్రకటించారు.


