అసంబద్ధ ప్రశ్నలు..
మోంథా తుపాను నష్టం అంచనా సర్వేలో ప్రభుత్వం గిమ్మిక్కులు నష్టాన్ని భారీగా తగ్గించి చూపుతున్న వైనం వ్యవసాయ, ఉద్యాన పంట నష్టాల్లో భారీగా కోత పరిహారమిస్తే.. ధాన్యం కొనుగోలు చేయబోమని మెలిక ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులు పంట దెబ్బ తిన్న ప్రాంతాల్లో నేడు కేంద్ర బృందం పర్యటన
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ప్రభుత్వం రైతుల పట్ల కపట ప్రేమ కనబరుస్తోంది. వీలైనంతగా పంట నష్టాన్ని తగ్గించి, రైతుల నోట్లో మట్టి కొట్టే యత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే మోంథా తుపాను పంట నష్టం అంచనాల్లో ప్రభుత్వం కోత విధించింది. ప్రాథమిక అంచనాలకు, తుది జాబితా మధ్య భారీగా వ్యత్యాస్యం కనిపిస్తోంది. తొలుత వ్యవసాయ పంటలకు సంబంధించి ప్రాథమిక అంచనా 1.16లక్షల ఎకరాలు కాగా, సర్వే తరువాత తుది పంట నష్ట అంచనా 75వేల ఎకరాలకు పరిమితం అయ్యింది. అంటే 38వేల ఎకరాల్లో కోత విధించారు. ఉద్యాన పంటలకు సంబంధించి 3,540 ఎకరాల్లో పంటలకు నష్టం వాటినట్లు అంచనా వేయగా, సర్వే తరువాత తుదిపంట నష్ట అంచనా 1,715 ఎకరాలుగా లెక్క కట్టారు. ఈ లెక్కన 1825 ఎకరాల్లో కోత విధించారు. దీనికి తోడు పంట నష్టం పరిహారం వస్తే, ఆ పొలంలో పండిన ధాన్యం కొనుగోలు చేయబోమని మెలిక పెట్టి, రైతులను ఆందోళనకు గురి చేస్తున్నారు. కౌలు రైతులకు రైతు భరోసా అందలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సోమవారం కేంద్ర బృందం జిల్లాలోని పంట దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించేందుకు రానుంది.
భారీ నష్టమైనా..
మోంథా తుపాను అన్నదాతకు గుండెకోతను మిగిల్చింది. ఈదురుగాలులు, భారీ వర్షానికి వరి పొలాలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. ఉద్యాన పంటలైన బొప్పాయి, అరటి, కూరగాయ పంటలకు అపార నష్టం వాటిల్లింది. ఈదురుగాలులకు చిరుపొట్ట దశ, గింజ గట్టి పడే దశలో ఉన్న వరి పంట నేలవాలింది. వరి దుబ్బులు మీదుగా వర్షపునీరు ప్రవహించింది. చిరుపొట్ట, గింజ గట్టిపడే దశలో వర్షం కురవటంతో తాలు తప్ప గింజ ఏర్పడుతుందని, మానుగాయ వచ్చి పంట దిగుబడులు గణనీయంగా పడిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే రైతులు ఒక్కో ఎకరాకు రూ.25 వేలు నుంచి రూ. 30వేల వరకూ పెట్టుబడులు పెట్టారు. పంట చేలు కోతకు సిద్ధమయ్యే దశలో వచ్చి పడ్డ తుపానుతో పెట్టుబడులు పూర్తిగా నీటిపాలై నట్టేట మునిగామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పంటలు డెబ్బతింటే, ఎకరాకు రూ.25వేలు ఇన్‌పుట్ సబ్సిడీ వచ్చిందని, ఇప్పుడు ఎకరాకు పంట నష్ట పరిహారం రూ.10వేలు ఇచ్చేందుకు సవాలక్ష నిబంధనలు పెడుతున్నారని రైతులు మండిపడుతున్నారు.
కంకిపాడు మండలం దావులూరులో మోంథా ధాటికి పడిపోయిన వరిని చూపుతున్న రైతు (ఫైల్)
ఈ ఏడాది 35 ఎకరాల్లో వరిసాగు చేశా. వరి కంకులు పాలుపోసుకునే దశలో ఉండగా వచ్చిన తుపాను వల్ల తీవ్ర నష్టం వాటిల్లింది. అధికారులు ఎంతసేపు పడిందా, నిలబడిందా అని అడుగుతున్నారు, పడిన దానికంటే నిలబడిన పొలాల్లోనే కంకులు రాసుకుని గింజలు తప్పలుగా మారిపోతున్నాయి. దీనిని ఎవరూ గమనించడం లేదు. నిలబడిన పంటపొలాల రైతులకు పరిహారం అందించాలి. ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలి.
– వేమూరి రత్నగిరి, రైతు, ఘంటసాల
ఉద్యాన పంటల నష్టం వివరాలు..
దెబ్బతిన్న పంటల ప్రాథమిక అంచనా : 3,540.55 ఎకరాలు
దెబ్బతిన్న పంటల తుది అంచనా : 1,715.07 ఎకరాలు
పంట నష్టం ప్రాథమిక అంచనా : రూ.73.45 కోట్లు
తుది అంచనా : రూ.23.43 కోట్లు
జిల్లాలో వ్యవసాయ పంటల నష్టం ఇలా..
పంట రకం ప్రాథమిక అంచనా తుది అంచనా ఇన్‌పుట్ సబ్సిడీ
(ఎకరాల్లో..) (ఎకరాల్లో..) (రూ.లక్షల్లో)
వరి 1,12,600 75,781.5 7,878.15
ఇతర పంటలు 3,742.5 2,056.2 75.75
మొత్తం 1,16,342.5 77,837.7 7,953.90
అసంబద్ధ ప్రశ్నలు..
అసంబద్ధ ప్రశ్నలు..


