జిల్లాలో క్షేత్ర పర్యటనకు ట్రైనీ ఐఏఎస్‌లు
మార్గనిర్దేశం చేసిన కలెక్టర్ లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): క్షేత్ర పర్యటనలో భాగంగా ట్రైనీ ఐఏఎస్‌లు జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో భౌగోళిక, సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక పరిస్థితులపై అవగాహన పెంపొందించుకోవాలని.. ఈ అవగాహన మున్ముందు విధి నిర్వహణకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌లో శిక్షణ పొందుతున్న 20 మంది ట్రైనీ ఐఏఎస్ అధికారులు మూడు బృందాలుగా ఈ నెల 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఎన్టీఆర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ట్రైనీ ఐఏఎస్‌లకు కలెక్టర్ లక్ష్మీశ ఆదివారం కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియతో కలిసి సమావేశం నిర్వహించారు.
అధికారులు సహకరించండి..
ఫీల్డ్ స్టడీ అండ్ రీసెర్చ్ ప్రోగ్రామ్ (ఎఫ్‌ఎస్‌ఆర్పీ) కింద ఆరు రోజుల క్షేత్ర పర్యటనను విజయవంతంగా పూర్తిచేసేందుకు మార్గనిర్దేశం చేశారు. జిల్లా భౌగోళిక పరిస్థితులు, మండలాలు, గ్రామాల వివరాలతో పాటు సాంస్కృతికంగా, పర్యాటకంగా కీలక ప్రాంతాల గురించి వివరించారు. టూర్ షెడ్యూల్‌కు అనుగుణంగా జరిగే క్షేత్ర పర్యటనలో రెవెన్యూ, పంచాయతీరాజ్, మునిసిపల్, పోలీస్, విద్య, వైద్య ఆరోగ్యం.. ఇలా వివిధ శాఖల అధికారులతో సమావేశాలతో పాటు స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్ లక్ష్యాల సాధన దిశగా క్షేత్రస్థాయిలో ఆయా శాఖల పరిధిలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలపై అవగాహన పెంపొందించేలా నోడల్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఆర్‌ఏ పీడీ ఏఎన్‌ఏవీ నాంచారరావు, డీపీవో పి.లావణ్య కుమారి తదితరులు పాల్గొన్నారు.


