మామూళ్ల వెంబడి! | - | Sakshi
Sakshi News home page

మామూళ్ల వెంబడి!

Nov 10 2025 7:20 AM | Updated on Nov 10 2025 7:20 AM

మామూళ్ల వెంబడి!

మామూళ్ల వెంబడి!

మామూళ్ల వెంబడి! ఎన్టీఆర్‌ జిల్లాలో ఎంఈవోల ఇష్టారాజ్యం పనికో రేటు.. ● మండల విద్యాశాఖాధికారులకు ఇతర ఆదాయాల విషయంలో మూడు పువ్వులు, ఆరు కాయలుగా ఉందనే విమర్శలు ఉన్నాయి. ● ఇటీవల దసరా సెలవుల నేపథ్యంలో తరగతులు నిర్వహిస్తున్న విద్యాసంస్థల నుంచి భారీగా ముడుపులు స్వీకరించారని విమర్శలున్నాయి. ● సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే తమకు ఫిర్యాదు చేయాలని విద్యాశాఖ పత్రికా ప్రకటన చేసి కొన్ని ఫోన్‌ నంబర్లను సూచించింది. అయితే విద్యార్థులు గానీ, వారి తల్లిదండ్రులు గాని ఫోన్‌ చేస్తే ఎంఈవోల పంట పండిందనే చెప్పాలి. ఏ ప్రైవేట్‌ పాఠశాల తరగతులు నిర్వహించారో ఆ విద్యాసంస్థను బెదిరించి తమకు ఫిర్యాదు అందిందనే నేపంతో భారీగా ముడుపులు స్వీకరించారని తెలిసింది. ● అలాగే ఆదివారాల్లో తరగతులు నిర్వహించుకోవటానికి అనధికార అనుమతి కోసం సైతం వారికి భారీగా ముడుపులు చెల్లించాల్సిందేనని ఆయా విద్యాసంస్థల నిర్వాహకులు చెబుతున్నారు. ● నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాల విక్రయాలు ఇతర అంశాలకు సైతం రేట్లు నిర్ణయించి ముడుపులు వసూలు చేస్తున్నారని వారు వివరిస్తున్నారు.

ప్రైవేట్‌ విద్యాసంస్థల నుంచి అడ్డగోలుగా దోపిడీ సెలవుల్లో తరగతులకొక రేటు నిబంధనలు ఉల్లంఘనకు మరో రేటు ప్రభుత్వ ఉపాధ్యాయుల నుంచి ప్రతి పనికీ మామూళ్లు ఫిర్యాదులు వస్తున్నా పట్టించుకోని ఉన్నతాధికారులు

ఎన్టీఆర్‌ జిల్లాలో ఎంఈవోల ఇష్టారాజ్యం

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): జిల్లాలో మండల విద్యాశాఖాధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. విద్యారంగంలో విద్యార్థులకు మేలు చేసేందుకు అవసరమైన పర్యవేక్షణ చేయాల్సిన మండల విద్యాశాఖాధికారులు అడ్డగోలు దోపిడీకి పాల్పడుతున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రధానంగా ప్రైవేట్‌ విద్యాసంస్థల నుంచి ఒకవైపు ప్రభుత్వ ఉపాధ్యాయుల నుంచి మరోవైపు తమకిష్టమైన రీతిలో లంచాలకు అలవాటుపడి మామూళ్ల మత్తులో ఉంటున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. వారిపై పదేపదే ఆరోపణలు వస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు.

జిల్లాలో ఇదీ పరిస్థితి..

ఎన్టీఆర్‌ జిల్లాలో 20 మండలాలకు ఎంఈవో–1లు తొమ్మిది మంది, ఎంఈవో–2లు 20 మంది కొనసాగుతున్నారు. 20 మండలాలకు కేవలం తొమ్మిది మంది మాత్రమే మండల విద్యాశాఖాధికారులు పని చేయటం సైతం వారి ఆదాయానికి అండగా నిలుస్తోంది. ఒక్కొక్క ఎంఈవో–1కు నాలుగైదు మండలాలు కేటాయించటంతో వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారే విమర్శలు ఉన్నాయి. అందులోనూ ఎంఈవో–1లు బాధ్యతలు నిర్వర్తిస్తున్న మండలాలు చాలా సుదూర ప్రాంతాలు కావటంతో వారి పర్యవేక్షణ సైతం అంతంతమాత్రంగానే ఉంటుందనే వాదనలు ఉన్నాయి.

ఉపాధ్యాయుల నుంచీ వసూళ్లు..

జిల్లాలో సుమారుగా 969 ప్రభుత్వ విద్యాసంస్థలు కొనసాగుతున్నాయి. అందులో సుమారుగా 5,160 మంది ఉపాధ్యాయులు వివిధ కేటగిరీల్లో కొనసాగుతున్నారు. ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి పనికి ఎంఈవోలు రేటు నిర్ణయించి మామూళ్లు వసూలు చేస్తున్నారు. ప్రధానంగా ప్రభుత్వ ఉపాధ్యాయుల సర్వీస్‌ విషయాలు, బిల్లు తయారీ తదితర అంశాలకు సంబంధించి ఎంఈవోల వసూళ్లు మాములుగా ఉండదని పలువురు గురువులు వాపోతున్నారు. అంతేకాకుండా ఉపాధ్యాయుల సర్వీస్‌ రిజిస్టర్ల విషయంలోనూ ఎంఈవోలు దారుణంగా వ్యవహరిస్తున్నారని ఆయా టీచర్లు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు.

ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకోరు..

జిల్లాలోని మండల విద్యాశాఖాధికారులపై ఫిర్యాదులు వస్తున్నా ఉన్నతాధికారులు పట్టించుకోవటం లేదనే విమర్శలు ఉన్నాయి. నగరంలోని ఒక ఎంఈవో ప్రైవేట్‌ విద్యాసంస్థకు వెళ్లి తనకు భారీగా ముడుపులు కావాలని బేరం పెట్టి విసిగించాడు. దాంతో ఆ విద్యాసంస్థ యాజమాన్యం నేరుగా అక్కడి నుంచే జిల్లా విద్యాశాఖాధికారికి ఫోన్‌ చేసి ఫిర్యాదు చేశారు. ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నా చర్యలు చేపట్టడం లేదు. అంతేకాకుండా సర్వీస్‌ రిజిస్టర్ల నిర్వహణలోనూ అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, రిటైర్డ్‌ అయిన ఉపాధ్యాయులకు సైతం బిల్లులు తయారు చేశారనే ఆరోపణలు గతంలో వచ్చాయి. ఆ ఆరోపణలపై విచారణకు అధికారులు ఆదేశించారు. అయితే ఆ తరువాత దానిని బుట్టదాఖలు చేశారని తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement