వైద్య విద్యార్థులకు రక్షణ కల్పించాలి
మధురానగర్(విజయవాడసెంట్రల్): వైద్య విద్యార్థులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని.. ఏలూరు మెడికల్ కాలేజీ హాస్టల్ విద్యార్థులను ఎలుకలు కరవడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని వైఎస్సార్ సీపీ వైద్య విభాగం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ అంబటి నాగరాధాకృష్ణ యాదవ్ అన్నారు. స్థానిక ముత్యాలంపాడులో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైఎస్సార్ సీపీ వైద్య విభాగం రాష్ట్ర జనరల్ సెక్రటరీ డాక్టర్ ఎం.ప్రభుదాస్‌తో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏలూరు ఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎలుకలు కరవటం వల్ల ఆరుగురు విద్యార్థులు రేబీస్ వ్యాక్సిన్ తీసుకోవాల్సి వచ్చిందని విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వైద్య విద్యార్థుల భద్రతపై తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించటం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం పరిపాలన, ప్రజా సంక్షేమంపై కాకుండా రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పని చేయాలని.. రాజకీయాలకు కాదని హితవు పలికారు.


