
ఆనంద పరవశం
తెల్లవారుజామున నాలుగు నుంచి అమ్మవారి దర్శనం
ఉదయం ఆరు గంటలకు ప్రత్యేక
ఖడ్గమాలార్చన(ఆరో అంతస్తు)
ఉదయం 7 గంటలకు ప్రత్యేక కుంకుమార్చన(ఆరో అంతస్తు)
ఉదయం 9 గంటలకు ప్రత్యేక చండీయాగం(యాగశాల)
ఉదయం 9 గంటలకు ప్రత్యేక శ్రీచక్రనవార్చన(లక్ష కుంకుమార్చన వేదిక)
సాయంత్రం 5 గంటలకు శ్రీ గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి వార్ల నగరోత్సవ సేవ
సాయంత్రం 5 గంటలకు మహా మండపం ఆరో అంతస్తులో వేదసభ, వేద పండితులకు సత్కారం
సాయంత్రం 6 గంటలకు అమ్మవారికి మహా నివేదన, పంచహారతుల సేవ, వేద స్వస్తి
రాత్రి 11గంటల వరకు అమ్మవారి దర్శనం
నేటి అలంకారం..
అశేష భక్తజనావళి జయజయధ్వానాలతో ఇంద్రకీలాద్రి మార్మోగింది. అక్షర ప్రదాయిని వైదేహి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో దుర్గమ్మ ఆలయం పోటెత్తింది. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో సోమవారం జగన్మాత జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం రోజున సరస్వతీ దేవిగా కొలువుదీరారు. ఆదివారం అర్ధరాత్రి నుంచే అమ్మవారి దర్శనం కోసం భక్తులు క్యూలో బారులు తీరారు. ఉదయమంతా భక్తి భావం.. సాయంత్రం వేళ సాంస్కృతిక వైభవంతో భక్తులు ఆనంద పరవశులయ్యారు.
ఆమూలాగ్రం..
అక్షర ప్రదాయినికి భక్తి హారతి పట్టిన జనం
దుర్గగుడిపై నేడు
ఆలయం బయట కంపార్ట్‌మెంట్‌లలో వేచియున్న భక్తులు (ఇన్‌సెట్) సరస్వతీదేవిగా దుర్గమ్మ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో కీలకమైన అమ్మవారి జన్మనక్షత్రం మూలానక్షత్రాన్ని పురస్కరించుకుని అశేష భక్తజనం ఇంద్రకీలాద్రికి తరలివచ్చి సర్వసతీదేవి అలంకారంలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఆదివారం రాత్రి 11గంటల నుంచే భక్తులు క్యూలైన్‌లో వేచి ఉండటం కనిపించింది. తెల్లవారుజామున అమ్మవారికి విశేష అలంకరణ, పూజా కార్యక్రమాల అనంతరం 1.30గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. రెండు సర్వ దర్శనం క్యూలైన్లతో పాటు రూ. 100, రూ. 300 టికెట్ క్యూలైన్‌లో సైతం భక్తులకు ఉచితంగా దర్శనానికి అనుమతించారు. రాత్రి 12గంటలకే వినాయకుడి గుడి క్యూలై న్లు నిండిపోవడంతో భక్తులను సీతమ్మవారి పాదాలు, వీఎంసీ కార్యాలయం సమీపంలోని కంపార్టుమెంట్లలోకి మళ్లించారు.
దుర్గమ్మ సేవలో డీకే శివకుమార్..
అమ్మవారిని తెల్లవారుజామున పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులతో పాటు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ దంపతులు దర్శించుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, సీపీ రాజశేఖరబాబు, విజయవాడ మునిసిపల్ కమిషనర్ ధ్యానచంద్ర భక్తుల రద్దీని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పరిశీలించి సిబ్బందికి సూచనలు ఇచ్చారు. హోల్డింగ్ పాయింట్ల నుంచి కొండపైకి చేరుకునేందుకు నాలుగు గంటలకు పైగా సమయం పట్టిందని భక్తులు పేర్కొంటున్నారు. మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని అమ్మవారికి సీఎం చంద్రబాబునాయుడు పట్టువస్త్రాలను సమర్పించారు. మధ్యాహ్నం ఒంటి గంటల నుంచే ఘాట్‌రోడ్డుపైకి ఎటువంటి వాహనాలను అనుమతించలేదు. సర్వ దర్శనంలో ఉన్న భక్తులకు గోశాల వద్ద నుంచి వీఐపీ క్యూలైన్‌లోకి అనుమతించారు.
కుమ్మరిపాలెం క్యూలైన్లలో రద్దీ..
ఈ ఏడాది దసరా ఉత్సవాలలో వినాయకుడి గుడి క్యూలైన్లతో పాటు కుమ్మరిపాలెం క్యూలైన్లను దేవస్థానం ఏర్పాటు చేసింది. గతంలో హెడ్ వాటర్ వర్క్సు వరకు మాత్రమే క్యూలైన్లు ఏర్పాటు చేసేవారు. అయితే ఈ ఏడాది కుమ్మరిపాలెం సెంటర్ వరకు క్యూలైన్లు ఏర్పాటు చేయడంతో వన్‌టౌన్, గట్టువెనుక ప్రాంతాల భక్తులకు సులభంగా అమ్మవారి దర్శనం అయిందనే చెప్పాలి. కుమ్మరి పాలెం వైపు ఉన్న క్యూలైన్‌లోకి చేరుకున్న భక్తులకు రెండు నుంచి మూడు గంటలలోపే అమ్మవారి దర్శనం పూర్తి కావడం విశేషం.
ఆర్జిత సేవలకు డిమాండ్..
మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని అమ్మవారికి నిర్వహించిన పలు ఆర్జిత సేవలలో ఉభయదాతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెల్లవారుజామున ఆరు గంటలకు నిర్వహించిన ప్రత్యేక ఖడ్గమాలార్చనకు 63 మంది ఉభయదాతలు, ప్రత్యేక చండీయాగానికి 52 మంది ఉభయదాతలు, ప్రత్యేక కుంకుమార్చనకు 174 మంది, ప్రత్యేక శ్రీచక్రనవార్చనకు 25 మంది ఉభయదాతలు పాల్గొన్నారు. ప్రత్యేక ఆర్జిత సేవల్లో పాల్గొన్న ఉభయదాతలకు బంగారు వాకిలి దర్శనం కల్పించారు.
ఉచిత లడ్డూ పంపిణీ..
అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు దేవస్థానం సోమవారం ఉచితంగా చిన్న లడ్డూలను పంపిణీ చేసింది. కొండపై రాయబార మండపం, అన్న ప్రసాద వితరణ వద్ద లడ్డూలను భక్తులకు పంపిణీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
సాంస్కృతిక
అంశాల్లో ప్రదర్శన ఇస్తున్న కళాకారిణి
ఆది దంపతులైన శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి పూలు, పండ్లతో అలంకరించిన పల్లకీపై ఇంద్రగిరి వీధుల్లో విహరించారు. సోమవారం యాగశాల నుంచి ప్రారంభమైన నగరోత్సవం.. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ కనుల పండువగా సాగింది. మహా మండపం, గోశాల, కనకదుర్గనగర్, ఘాట్‌రోడ్డు మీదగా ఆలయానికి చేరుకుంది. ఆలయ ప్రాంగణంలో రాజగోపురం ఎదుట ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ మంగళవారం శ్రీదుర్గాదేవిగా దర్శనమిస్తారు. శరన్నరరాత్రులలో దుర్గాదేవిని అర్చించటం వల్ల దుర్గతులను పోగొట్టి సద్గతులను ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసం.

ఆనంద పరవశం

ఆనంద పరవశం

ఆనంద పరవశం

ఆనంద పరవశం

ఆనంద పరవశం

ఆనంద పరవశం

ఆనంద పరవశం