
అవినీతి తప్ప అభివృద్ధి శూన్యం
గుణదల (విజయవాడతూర్పు): రాష్ట్రంలో, విజయవాడ నగరంలో వైఎస్సార్ సీపీ హయాంలో రూ.వందల కోట్ల అభివృద్ధి జరిగిందని, కూటమి ప్రభుత్వం హయాంలో ఇప్పటివరకు ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదని ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జి దేవినేని అవినాష్ అన్నారు. గుణదలలోని జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేతలకు అక్రమాలు, అవినీతిపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై లేదన్నారు. కూటమి ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి జరగకపోవటంతో ఆ పార్టీల నేతలకు ఏం చేయాలో పాలుపోవడం లేదన్నారు. కూటమి నేతలు హామీలపై బాండ్లు ఇచ్చారని, కానీ అవి పనికిరాకుండా పోయాయని, తల్లికి వందనం, నిరుద్యోగ భృతిలాంటి ఎన్నో పథకాలు దిక్కు లేకుండా పోయాయని విమర్శించారు. ప్రజలు ఇప్పుడు వైఎస్ జగన్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను మననం చేసుకుంటున్నారన్నారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులు కూటమి నేతలకు పట్టడం లేదని, ప్రజలందరి పక్షాన తాము పోరాడటానికి సిద్ధంగా ఉన్నామన్నారు.
తూర్పులో చంద్రబాబు డూప్
తూర్పు నియోజకవర్గంలో ఉన్న ప్రజాప్రతినిధి చంద్రబాబు డూప్ అని, చంద్రబాబు చెప్పే అబద్ధాలకు మరికొన్ని అబద్ధాలను చేర్చి ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు.
చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రజలను ఏమార్చేందుకు పీ–4 అని కొత్త స్కాంను తీసుకొచ్చారన్నారు. టీడీపీ సోషల్ మీడియాలో జగన్ కుటుంబ సభ్యులపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, టీడీపీ కార్యాలయం నుంచి వచ్చిన స్క్రిప్ట్‌ను పట్టుకుని వాళ్లు మాట్లాడుతున్నారని, మళ్లీ వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి వారిని చట్టం ముందు నిలబెడతామన్నారు. సమావేశంలో డెప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, మాజీ డెప్యూటీ మేయర్ ఆళ్ల చెల్లారావు, వీఎంసీ వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ వెంకట సత్యం, కార్పొరేటర్లు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్