అమ్మవారికి అర్చన నిమిత్తం పుష్పాలను తీసుకువస్తున్న చైర్మన్ రాంబాబు, ఈవో భ్రమరాంబ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో వసంత నవరాత్రోత్సవాలలో భాగంగా మూడో రోజు శుక్రవారం అమ్మవారికి తెల్ల చామంతులు, గులాబీలతో అర్చన చేశారు. తొలుత అమ్మవారికి పుష్పార్చన నిమిత్తం తీసుకువచ్చిన పుష్పాలతో ఆలయచైర్మన్ కర్నాటి రాంబాబు, ఈవో భ్రమరాంబ, స్థానాచార్య విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ, వైదిక కమిటీ సభ్యుడు రంగావజ్జుల శ్రీనివాసశాస్త్రి, పాలక మండలి సభ్యులు మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం లక్ష్మీ గణపతి ప్రాంగణంలోని అమ్మవారి ఉత్సవ మూర్తికి సమర్పించారు. ఆలయ అర్చకులు, వేద పండితుల వేద మంత్రోచ్చారణ మధ్య అమ్మవారికి విశేష పుష్పార్చన నిర్వహించారు. పలువురు ఉభయదాతలు పుష్పార్చనలో పాల్గొన్నారు. రూ.2500 టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు పుష్పార్చనలో పాల్గొనే అవకాశాన్ని దేవస్థానం కల్పిస్తుంది. ఇక ఒక రోజు మొత్తం అర్చనకు వినియోగించే పుష్పాల కోసం రూ.10 వేలు చెల్లిస్తే వారి పేరుతో పూజ జరిపిస్తారు. విశేష పుష్పార్చన అనంతరం అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు అర్చన జరిపిన పుష్పాలను ప్రసాదంగా పంపిణీ చేశారు.
నేడు మందారం, ఎర్ర కలువ పూలతో అర్చన
ఇంద్రకీలాద్రిపై శనివారం దుర్గమ్మకు మందారపూలు, ఎర్ర కలువ పూలతో అర్చన నిర్వహిస్తారు. వసంత నవ రాత్రోత్సవాలలో భాగంగా నాల్గో రోజున లక్ష్మీ గణపతి ప్రాంగణంలో అమ్మవారికి విశేష పుష్పార్చన జరుగుతుంది.
వైభవంగా వసంత నవరాత్రోత్సవాలు
అమ్మవారికి అర్చన నిర్వహిస్తున్న ఆలయ అర్చకులు


