ముమ్మరంగా ఉపాధి | - | Sakshi
Sakshi News home page

ముమ్మరంగా ఉపాధి

Oct 15 2026 11:53 AM | Updated on Oct 15 2026 11:53 AM

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని పేద, సామాన్య ప్రజలు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. కూలీలకు గ్రామాల్లో ఉపాధి కల్పించడమే ధ్యేయంగా వీబీజీ రామ్‌జీ (ఉపాధిహామీ) పథకం పనులను ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే డిచ్‌పల్లి, సిరికొండ, భీమ్‌గల్‌, ఇందల్వాయి, మోపాల్‌, నందిపేట్‌, మాక్లూర్‌, ఎడపల్లి, జక్రాన్‌పల్లి, ఆలూర్‌, ధర్పల్లి లాంటి మండలాల్లో కూలీలు భారీ సంఖ్యలో పనులకు వస్తున్నారు. మిగతా మండలాల్లో కూడా కూలీల సంఖ్యను మరింత పెంచేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు.

జీపీకి 40 నుంచి 60 మందికి తగ్గకుండా..

జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో కనీసం 40 నుంచి 60 మందికి తగ్గకుండా కూలీలకు కచ్చితంగా పనులు కల్పించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సాయన్న కింది స్థాయి సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో అధికారులు తీసుకుంటున్న ప్రత్యేక చొరవ కారణంగా జిల్లాలో గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ప్రస్తుతం ఉపాధి పనులకు వచ్చే కూలీల సంఖ్య 10 రెట్లు పెరిగింది. ప్రస్తుతం గ్రామాల్లో కాలువల (కెనాల్స్‌) వెంట పూడికతీత పనులు, నీటి సంరక్షణ (వాటర్‌ హార్వెస్టింగ్‌) నిర్మాణాలు, వ్యవసాయ భూముల్లో పంట కుంటలు (ఫాం పాండ్స్‌), చెరువుల్లో చేపల కుంటల (ఫిష్‌ పాండ్స్‌) ఏర్పాటు వంటి పనులను కూలీలతో వేగంగా చేయిస్తున్నారు. పనికి వచ్చిన కూలీలకు రోజుకు రూ.300 వరకు కూలి లభిస్తోంది.

ఎల్‌నినో వేళ.. వలసలను నివారించేందుకు పనులు

గతేడాదితో పోలిస్తే పది రెట్లు పెరిగిన కూలీల సంఖ్య

ఊరికి 50మందికి తగ్గకుండా చూడాలని డీఆర్డీవో ఆదేశాలు

జిల్లాలో యాక్టివ్‌ జాబ్‌ కార్డులు 1.49లక్షలు

యాక్టివ్‌ కూలీలు 2.21లక్షలు

పనులు జరుగుతున్న జీపీలు 529

ప్రస్తుతం పనులకు వస్తున్న వారు 11వేల పైచిలుకు

లక్ష్యం దిశగా అడుగులు

ఈ ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాలో మొత్తం 51 లక్షల పనిదినాలు కల్పించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా ఇప్పటివరకు 35.08 లక్షల పనిదినాలను కూలీలకు విజయవంతంగా కల్పించారు. ఎల్‌నినో ప్రభావ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, రానున్న రెండు మూడు నెలల్లో కూలీల సంఖ్యను మరింత పెంచి, వలసలను పూర్తిగా నివారించేలా మరిన్ని పనులు కల్పించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement