● గతేడాది క్రీడలు నిర్వహించకుండానే నిధుల మళ్లింపు
● తెలిసినా పట్టించుకోని
విద్యాశాఖ అధికారులు
నిజామాబాద్అర్బన్: విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి వారిని క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో క్రీడల నిర్వహణ ప్రధానం. విద్యార్థులకు ప్రతి సంవత్సరం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ గేమ్స్(ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహిస్తారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులను వివిధ స్థాయిలకు ఎంపిక చేస్తారు. క్రీడల నిర్వహణకు ప్రయివేటు పాఠశాలలోని ఆరు నుంచి పదో తరగతి, ప్రభుత్వ పాఠశాలలోని తొమ్మిది, పదో తరగతి విద్యార్థుల నుంచి పరీక్ష ఫీజుతోపాటు అదనంగా రూ.14 చొప్పున జిల్లా ఉమ్మడి పరీక్షల విభాగం వసూలు చేస్తుంది. అనంతరం వచ్చిన నిధులను ఎస్జీఎఫ్ సెక్రెటరీకి బదిలీ చేస్తుంది. వచ్చిన నిధులతో క్రీడాపోటీలు నిర్వహించాల్సి ఉంటుంది. గతేడాది వసూలు చేసిన రూ.10 లక్షలు పరీక్షల విభాగం నుంచి మొదటి విడత రూ.3 లక్షలు, రెండో విడత రూ.7 లక్షలు ఎస్జీఎఫ్ సెక్రెటరీ ఖాతాకు బదిలీ చేశారు. అయితే కొత్తగా వచ్చిన ఎస్జీఎఫ్ సెక్రెటరీ నిధుల వివరాలు పరిశీలించగా రూ.10 లక్షలకు కేవలం రూ.2 లక్షలు మిగిలి ఉన్నాయి. మిగతా రూ.8 లక్షల వివరాలు అందుబాటులో లేనట్లు తెలిసింది. కాగా, నిధులు లేని సమయంలో క్రీడల నిర్వహణకు సొంత డబ్బులు ఖర్చు చేసినట్లు చెబుతూ గతంలో పనిచేసిన సెక్రెటరీ రూ.5 లక్షలు తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. వాస్తవానికి గతేడాది క్రీడా పోటీలు చేపట్టలేదు. డబ్బులను నేరుగా సొంత ఖాతాలోకి మళ్లించుకున్నట్లు తెలిసింది. అయితే ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు సైతం మౌనం వహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం క్రీడాపోటీల నిర్వహణకు ఎస్జీఎఫ్ సిద్ధమవుతుండగా విద్యార్థుల నుంచి ఫీజు వసూలు చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. కొందరు పీఈటీలు ఇప్పటికే ఒక్కో విద్యార్థి నుంచి రూ.250 చొప్పున వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.
నిధులు ఇచ్చేశాం
విద్యార్థుల నుంచి క్రీడల నిర్వహణకు సంబంధించి ప్రతి సంవత్సరం పరీక్ష ఫీజుతోపాటు రూ.14 వ సూలు చేస్తున్నాం. గతేడాది విద్యార్థుల నుంచి వ సూలు చేసిన క్రీడా రుసుము రూ.10 లక్షలు రెండు విడతలుగా ఎస్జీఎఫ్ విభాగానికి బదిలీ చేశాం. నిధుల నిర్వహణ వారి బాధ్యతే.
– సీతయ్య, జిల్లా ఉమ్మడి పరీక్షల విభాగం సెక్రెటరీ
రూ.రెండు లక్షలు ఉన్నాయి
బాధ్యతలు చేపట్టే నాటికి నాకు కేవలం రూ.2 లక్ష లు ఉన్నట్లు చూపించారు. ఉమ్మడి పరీక్షల విభాగం నుంచి నిధులు మళ్లించినట్లు తెలిసింది. కానీ పూర్తిస్థాయి నిధులు అందుబాటులో లేవు. దీనిపై కొందరిని ప్రశ్నించగా సొంత డబ్బులు ఖర్చు చేసినందుకు ఈ డబ్బులు తీసుకున్నట్లు సమాధానం వచ్చింది. – అలివేణి మంగ, ఎస్జీఎఫ్ సెక్రెటరీ


