వేల్పూర్(మెండోరా): భూ సమస్యల పరిష్కారానికే భూ భారతి రీసర్వే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని జిల్లా అదనపు కలెక్టర్ రాజాగౌడ్ అన్నారు. మెండోరా మండలం వెల్గటూర్‌లో మంగళవారం నిర్వహించిన భూభారతి రీసర్వే అవగాహన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భూ వివాదాలను అరికట్టడం, భూముల సరిహద్దుకు సంబంధించిన సమస్యలు పరిష్కరించడం సర్వే ముఖ్య ఉద్దేశమన్నారు. భూ వివాదాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి, కంప్యూటర్ ఆధారిత విధానంలో సర్వే వివరాలను పొందుపరుస్తారని వెల్లడించారు. రైతులు, గ్రామస్తులు రీ సర్వేకు సహకరించాలని కోరారు. మెండోరా తహసీల్దార్ శ్రీనివాస్, అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు, డీఐలు శేఖర్‌వర్మ, శ్రీనివాస్, వెల్గటూర్ సర్పంచ్ కావ్య, వెల్గటూర్ తండా నర్పంచ్ రవినాయక్, మండల ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షుడు బద్దం శ్రీనివాస్, ఆర్‌ఐ గోపాల్, జీపీవో ప్రకాశ్, రైతులు పాల్గొన్నారు.


