నిజామాబాద్‌అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు జి ల్లాలో కొనసాగుతున్నాయి. మొదటి విడత 85 శాతం గ్రౌండింగ్ పూర్తయ్యాయి. మొత్తం 17218 ఇళ్లు మంజూరు చేయగా, 5890 ఇళ్ల నిర్మాణం పూర్తయ్యింది. మిగతా ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. ప్రారంభంలో నిబంధనలు కఠినంగా ఉండడంతో కొందరికి అవకాశం దక్కలేదు. ప్రభుత్వం తరు వాత నిబంధనలను సడలించడంతో ఇళ్లు లేని వా రందరికీ మంజూరు అయ్యే అవకాశం లభించింది. అర్హుల ఎంపిక, వెంటనే నిర్మాణ పనులు చేపట్టడంలో అధికారులు ప్రత్యేక చొరవ చూపుతుండడంతో నిర్మాణ పనులు పుంజుకున్నాయి. నిర్మాణ పనులు ప్రారంభించేందుకు అవసరమైన డబ్బులు చేతిలో లేనివారికి స్వయంసహాయ సంఘాల ద్వారా రుణ అవకాశం కల్పించారు. అనంతరం దశలవారీగా బి ల్లులను మంజూరు చేస్తుండడంతో నిర్మాణాలు కొ నసాగుతున్నాయి. రెండో దశలోనూ ప్రతి నియోజకవర్గానికి 1500 ఇళ్లను మంజూరు చేశారు. నెల రోజుల క్రితమే అర్హులను గుర్తించి వారికి మంజూ రు చేశారు. నిబంధనల సడలింపుతో గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణ పనులు ఊపందుకున్నాయి.
మండలాల వారీగా..
మండలాల వారీగా నవీపేట మండలం 299 ఇళ్ల నిర్మాణాలు పూర్తి కావడంతో ముందంజలో ఉంది. అలాగే బోధన్‌లో 264, వర్నిలో 207, డిచ్‌పల్లిలో 249, ధర్పల్లిలో 210, భీమ్‌గల్‌లో 307, వేల్పుర్‌లో 221, ఎడపల్లిలో 216, రెంజల్‌లో 211, మాక్లూర్‌లో 225 ఇళ్లు పూర్తయ్యాయి.
రూఫ్ రీప్లేస్‌కు రూ.2 లక్షలు
రూఫ్ పనులు మధ్యలో నిలిచిన, మరమ్మతుల అవసరమైన ఇళ్లకు ప్రభుత్వం రూ.2 లక్షల చొప్పున మంజూరు చేస్తోంది. ప్రతి నియోజకవర్గానికి 500 ఇళ్లకు మంజూరు లభించింది. గతంలో నిర్మాణం ప్రారంభించి మధ్యలో నిలిపివేసిన, రూఫ్ బాగోలేకపోయినా దరఖాస్తు చేసుకుంటే అధికారులు అర్హులను ఎంపిక చేసి నిధులు మంజూరు చేస్తారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధం లేకుండా రూఫ్ రీప్లేస్ కొనసాగుతుంది.
జిల్లాలోని బోధన్ నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో 1345 ఇళ్ల నిర్మాణాలు పూర్తికాగా, నిజామాబాద్ రూరల్‌లో 1182, బాల్కొండ నియోజకవర్గంలో 1170, ఆర్మూర్ నియోజకవర్గంలో 921 ఇళ్లను నిర్మించారు. అయితే నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 2005 ఇళ్లు మంజూరుకాగా, అతి తక్కువ సంఖ్యలో 444 ఇళ్ల నిర్మాణం పూర్తయ్యింది. స్థలం సమస్య కారణంగా నిర్మాణాలు వేగం పుంజుకోవడం లేదు. బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోని 6 మండలాల్లో 1932 ఇళ్లు మంజూరు కాగా, 830 ఇళ్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఆర్మూర్ నియోజకవర్గంలో 301, బాన్సువాడ 58, నిజామాబాద్ అర్బన్ 1495, నిజామాబాద్ రూరల్‌లో 148 , బాల్కొండలో 179 ఇళ్లను మంజూరు చేయనున్నారు.
వేగంగా నిర్మాణాలు
జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల పనులు వేగంగా సాగుతున్నాయి. దరఖాస్తు చేసుకున్నవారు ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన చేపట్టేలా ప్రత్యేక దృష్టిసారించాం. జిల్లాలో ఇప్పటికే 85 శాతం ఇళ్ల గ్రౌండింగ్ పూర్తయ్యింది. వివిధ దశల్లో కొనసాగుతున్న పనులు త్వరలో పూర్తవుతాయి.
– గీత, డీఆర్‌వో, ఇన్‌చార్జి హౌజింగ్ పీడీ


