● ఆర్టీసీ రీజియన్ పరిధిలో 96.31 పోలింగ్ శాతం నమోదు
● ఆధిక్యంలో టీఎంయూ
● 17న అధికారిక ఫలితాల విడుదల
నిజామాబాద్ రూరల్ /ఆర్మూర్ టౌన్/ బోధన్ : తెలంగాణ ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు ప్రశాంతంగా హోరాహోరీగా సాగాయి. శుక్రవారం ఉదయం 5 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. రీజియన్ పరిధిలోని ఆర్‌ఎం కార్యాలయంతోపాటు నిజామాబాద్–1, 2, ఆర్మూర్, బోధన్, కామారెడ్డి, బాన్సువాడ డిపోలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సేవలందిస్తున్న సిబ్బంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆరు డిపోల పరిధిలో మొత్తం 1927 ఓట్లు ఉండగా 1825 మంది ఓటు వేశారు. పోలింగ్ 96.31 శాతం నమోదైంది. అయితే ఈ నెల 14, 15 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్‌కు అవకాశం కల్పించనున్నారు. వాటిని ఈ నెల 16న లెక్కించి, తుది ఫలితాలను 17వ తేదీన అధికారికంగా వెల్లడించనున్నట్లు కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రావణి తెలిపారు. ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ డిపో–1, డిపో –2లను సందర్శించిన ఆమె పోలింగ్ సరళిని పరిశీలించారు. పోలింగ్ అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టగా అత్యధికంగా తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) ఆధిక్యంలో ఉన్నట్లు తెలిసింది. డిపోల వారీగా ఆధిక్యం వచ్చిన యూనియన్లు సంబురాలు నిర్వహించారు.
ఆర్‌ఎం నిజామాబాద్–1 నిజామాబాద్–2 బోధన్ ఆర్మూర్ కామారెడ్డి బాన్సువాడ
మొత్తం ఓట్లు 36 365 171 357 272 408 315
పోలైన ఓట్లు 34 354 171 332 254 395 312
ఆధిక్యం 29 318 72 276 225 271 252
(టీఎంయూ) (టీఎంయూ) (టీఆర్‌డబ్ల్యూయూ) (టీఎంయూ) (టీఎంయూ) (టీఎంయూ) (టీఎంయూ)


