జిల్లాలో పచ్చి వరి ధాన్యానికి డిమాండ్ క్వింటాలుకు రూ.3,600 వరకు పలుకుతున్న ధర
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఎన్నడూ లేనంతగా ఈసారి వరి ధాన్యానికి మంచి ధర పలుకుతుండటంతో రైతుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. అయితే, రైతుల ఆశలకు నీళ్లు చల్లుతూ కొంతమంది స్థానికులు అడ్డంకులు సృష్టిస్తున్నారన్న ఆందోళన రైతుల్లో మొదలైంది. ఈసారి సీజన్ ప్రారంభంలోనే పచ్చిధాన్యం కొనుగోలు చేసేందుకు క్వింటాలు రూ. 3,300 వరకు ధర పలికింది. ప్రభుత్వ మద్దతు ధర కన్నా అధికంగా ఉండటంతో రైతులు పొలాల వద్దే నేరుగా వ్యాపారులకు ధాన్యాన్ని విక్రయిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రతోపాటు రాష్ట్రంలోని మిగితా జిల్లాల నుంచి వ్యాపారులు వచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేస్తుండగా, స్థానిక వ్యాపారులు అడ్డుపడుతున్నట్టు రైతులు వాపోతున్నారు. ఈ క్రమంలో ఇప్పటివరకు పలుకుతున్న ధర తమకు దక్కుతుందా, లేదా? అన్న ఆందోళన రైతుల్లో నెలకొంది.
రూ. 3,800 నుంచి రూ.3,300కు..
ఈసారి తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఇతర రాష్ట్రాలు, రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో వరిసాగు విస్తీర్ణం, దిగుబడి గణనీయంగా తగ్గడంతో వరిధాన్యానికి డిమాండ్ పెరిగింది. జిల్లాలోని వర్ని, చందూరు, మోస్రా, ఎడపల్లి, నందిపేట, మాక్లూర్ మండలాల్లో వరి కోతలు ప్రారంభమయ్యాయి. వారం క్రితం వరకు వర్ని మండలంలో క్వింటాలు పచ్చిధాన్యానికి రూ. 3,300 వెచ్చించి వ్యాపారులు కొనుగోలు చేశారు. బయటి రాష్ట్రాల నుంచి వస్తున్న వ్యాపారులతో ధాన్యం డిమాండ్ అంతకంతకూ పెరిగి రెండు రోజులుగా ధర ఎగబాకింది. వర్ని, చందూరు, మోస్రా మండలాల్లో రెండ్రోజులుగా క్వింటాలు ధర రూ. 3,600 నుంచి 3,800 వరకు వెచ్చించేందుకు వ్యాపారులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న కొందరు వ్యాపారులు కలుగజేసుకొని బయటి వ్యాపారులపై ఒత్తిళ్లకు గురిచేసినట్టు రైతులు ఆరోపిస్తున్నారు. వ్యాపారుల ఒత్తిళ్లతో బుధవారం క్వింటాలుకు రూ. 3,300 చెల్లించి కొనుగోళ్లు చేపట్టినట్లు రైతులు చెబుతున్నారు. నందిపేట, మాక్లూర్ మండలాల్లోనూ క్వింటాలుకు రూ. 3,550 వరకు ధర వెచ్చించి కొనుగోలు చేయగా స్థానికంగా ఉన్న వ్యాపారులు అడ్డుపడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వ్యాపారుల మధ్య పంచాయితీలతో పంట ధరలను తగ్గిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు, ప్రభుత్వం జోక్యం చేసుకొని రైతులు స్వేచ్ఛగా ధాన్యం విక్రయించుకునేలా చూడాలని కోరుతున్నారు.
‘వర్ని మండలంలో 10 రోజుల క్రితం వరికోతలు ప్రారంభమయ్యాయి. ఏపీ, మహారాష్ట్రతోపాటు రాష్ట్రంలోని మిర్యాలగూడ నుంచి వస్తున్న వ్యాపారులు క్వింటాలు రూ. 3,600 వరకు వెచ్చించి పచ్చిధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. అయితే రెండు రోజులుగా క్వింటాలుకు రూ. 3,800 చెల్లించి కొనుగోలు చేసేందుకు ముందుకురాగా, స్థానికంగా ఉన్న వ్యాపారులు అడ్డంకులు సృష్టిస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో బుధవారం నాటికి క్వింటాలు ధర అమాంతం రూ. 3,300కి పడిపోయింది.’
‘నందిపేట మండలంలో వరి కోతలు మొదలయ్యాయి. ధాన్యం విక్రయానికి సిద్ధమవుతుండగా.. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వ్యాపారులను ధాన్యం కొనకుండా స్థానిక వ్యాపారులు నిలువరిస్తున్నారని రైతులు వాపోతున్నారు. వ్యాపారులు కొనడం లేదన్న సమాచారంతో రైతులు వరికోతలను నిలిపివేస్తున్నారు. కోతలు ఆగడంతో నందిపేట మండలం తల్వేదలో సుమారు 30 వరకు హార్వెస్టర్లు నిలిచిపోయాయని రైతులు చెబుతున్నారు.’
రైతులకు మేలు చేయాలి
ఈసారి వరి ధాన్యానికి మంచి డిమాండ్ ఉంది. మా మండలంలో క్వింటాలుకు రూ. 3,550 వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. కానీ, ఇతర రాష్ట్రాల వ్యాపారులు కొనుగోలు చేయకుండా స్థానిక వ్యాపారులు అడ్డుకుంటున్నారు. రైతులకు నష్టం జరుగకుండా చూడాలి.
– కోల రాములు, మాజీ ఎంపీపీ, నందిపేట మండలం
కోతలు ఆగిపోయాయి
రైతులు తమ పంటను ఎవరికై నా అమ్ముకునే స్వేచ్ఛ కూడా ఉండటం లేదు. ఇతర రాష్ట్రాల వ్యాపారులు ఎక్కువ ధర ఇచ్చి కొనుగోలు చేస్తుంటే స్థానికంగా ఉన్న వ్యాపారులు అడ్డుపడుతున్నారు. వారి బెదిరింపులతో వ్యాపారులు ధాన్యాన్ని కొనడంలేదు. మా గ్రామంలో 30 వరకు వరికోత మిషన్లు నిలిచిపోయాయి.
– బాద్గుణ చిన్నయ్య, తల్వేద, నందిపేట మండలం
వ్యాపారులు సహకరించాలి
వరి ధాన్యాన్ని మంచి ధర పలుకుతోంది. ఇప్పటికే వర్షాభావ పరిస్థితులతో వరి సాగు తక్కువగా ఉంది. బయటి రాష్ట్రాల వ్యాపారులు మంచి ధరకు కొనుగోలు చేస్తుంటే ఇక్కడి వ్యాపారులు అడ్డుపడటం సరికాదు. రైతుల శ్రేయస్సు కోసం స్థానిక వ్యాపారులు సహకరించాలి. తమ పంటను ఎవరికై నా అమ్ముకునే హక్కు రైతులకు ఉంది.
– నేమాని వీర్రాజు, వర్ని సహకార సంఘం మాజీ అధ్యక్షుడు


