సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో గ్రామాభివృద్ధి కమిటీ(వీడీసీ)లే సుప్రీంగా వ్యవహరిస్తున్నాయని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జి.నిరంజన్ పేర్కొన్నారు. గ్రామాల్లో సమాంతర వ్యవస్థను చెలాయిస్తూ వాళ్ల ప్రత్యేక చట్టాన్ని నడిపిస్తున్నారని చెప్పారు. బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అంతకుముందు వీడీసీల ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులతో ప్రత్యేకంగా సమావేశమై వారి సమస్యలను విన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్ట ర్ భుజంగరావు, జిల్లా అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిరంజన్ మాట్లాడుతూ జిల్లాలో పలుచోట్ల వీడీసీల ఆగ డాలు మితిమీరుతున్నాయని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలను సామాజిక బహిష్కరణ, జరిమానా లు విధిస్తూ ఇబ్బందులు పెడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. బాధితులతో ముఖాముఖి సందర్భంగా జిల్లావ్యాప్తంగా 90 దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు.
అడిషనల్ కలెక్టర్ స్థాయిలో పర్యవేక్షణ..
బాధితుల రక్షణ కోసం ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ అ ట్రాసిటీ చట్టం, పౌర హక్కుల రక్షణ చట్టాలు ఉన్నా అమలుకు నోచుకోవడం లేదన్నారు. త్వరలో బీసీ రక్షణ చట్టాన్ని అమలుచేయాలని కమిషన్ తరఫున ప్రభుత్వానికి తీర్మానాన్ని పంపించామని చెప్పారు. భవిష్యత్తులోనూ ఇలాంటి ఘటనలను నివారించేందుకు అదనపు కలెక్టర్ స్థాయిలో పర్యవేక్షణకు ఒక కమిటీని నియమించాలన్నారు. కలెక్టరేట్‌లో బాధితులకు సహాయంగా ఉచిత లీగల్ ఎయిడ్ కేంద్రా న్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించా రు. అభివృద్ధి కోసం కార్యక్రమాలు చేపట్టాలని, ఆంక్షలు విధించకుండా గౌరవాన్ని కాపాడుకోవాల ని వీడీసీలను కోరారు. ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా, అడిషనల్ డీసీపీ శుభం ప్రకాశ్, ఏసీపీలు ప్రకాశ్ యాదవ్, వెంకటేశ్వర్‌రెడ్డి, బీసీ కమిషన్ అధికారులు సునీత, ఇర్ఫాన్, సతీశ్, జిల్లా బీసీ సంక్షేమ అధికారి సాయికుమార్ పాల్గొన్నారు.
నాయకులకు బాధ్యత లేదా?
గ్రామాల్లో తమ మాట వినని వారిని బహిష్కరించడం, వారికి ఎవరూ సహాయం చేయకుండా చేయడం, వ్యవసాయ పనులకు సహకరించకుండా నిరోధించడంతో పరిస్థితి తీవ్రంగా మారిందని వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజా నాయకులకు బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. ఎన్నో ఉదంతాలు చోటుచేసుకుంటున్నా ప్రజల గోడు పట్టడం లేదని చెప్పారు. చివరికి వీడీసీలకు ప్రజా ప్రతినిధులు భయపడే పరిస్థితి వచ్చిందన్నారు.
అధికారుల కన్నా వాళ్ల చట్టమే
నడుస్తోంది
అభివృద్ధి పేరిట పౌర హక్కుల ఉల్లంఘన
త్వరలోనే బీసీలకు రక్షణ చట్టం
రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్


