డిచ్‌పల్లి(ఇందల్వాయి): ఇందల్వాయి పోలీస్‌స్టేషన్ పరిధిలోని గంగారాం తండా శివారులోగల 44వ నెంబర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. ఎస్సై సందీప్ తెలిపిన వివరాలు ఇలా.. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రవిపాఠక్ (38) అనే వ్యక్తి డిచ్‌పల్లి మండలం బీబీపూర్ తండా శివారులోని బబ్లు యూపీ దాబాలో పని చేస్తున్నాడు. ఆదివారం రాత్రి దాబా నుంచి బయలుదేరిన రవిపాఠక్ హైవేపై నడుచుకుంటూ వెళుతున్నాడు. ఈక్రమంలో గంగారాం తండా శివారులోని హైవేపై అతడిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈఘటనలో అతడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. దాబా యజమాని పరమేశ్వర్‌పాండే ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
చేపల వేటకు వెళ్లి ఒకరు..
బోధన్: ఎడపల్లి మండలం అంబం గ్రామంలో ఓ వ్యక్తి చెరువులో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటమునిగి మృతిచెందాడు. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన డప్పు మహేష్ (40) ఆదివారం ఉదయం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేడు. దీంతో అతడి ఎడపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. సోమవారం గ్రామంలోని చెరువులో మహేష్ మృతదేహం లభ్యమైంది. గ్రామస్తుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, వివరాలు సేకరించారు. మృతుడు కాలకృత్యాలకు వెళ్లిన అనంతరం, చెరువులో చేపల వేటకు వెళ్లాడు. నీటిలో వల వేయగా ప్రమాదవశాత్తు వల కాళ్లకు చుట్టుకుని నీటిలో మునిగి చనిపోయాడు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై ముత్యాల రమ తెలిపారు.
బ్రాహ్మణపల్లిలో..
జక్రాన్‌పల్లి: మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామ శివారులోని చెరువులో పడి ఓ వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. ఆర్మూర్ పట్టణానికి చెందిన చనమతుల శివ(30) కొంతకాలంగా బ్రాహ్మణపల్లి గ్రామంలోని కానున్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. స్థానికంగా ప్లాస్టిక్ డ్రమ్ములు అమ్ముతూ జీవిస్తున్నాడు. కొన్ని సంవత్సరాలుగా అతడు ఫిట్స్ వ్యాధితో బాదపడుతున్నాడు. కాగా ఈ నెల 1న శివ కాలకృత్యాల కోసం పక్కన ఉన్న చెరువు దగ్గరకి వెళ్లగా, అదే సమయంలో ఫిట్స్ రావడంతో చెరువులో పడి, మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


