యాసంగికి ఢోకా లేదు!
● ఎస్సారెస్పీలో ఆశాజనకంగా
నీటి నిల్వలు
● డిసెంబర్ మొదటి వారంలో
విడుదలకు ప్రణాళిక
బాల్కొండ: శ్రీరాంసాగర్ జలాశయంలో ప్రస్తుత యాసంగి సీజన్‌కు నీటి నిల్వలు ఆశాజనకంగా ఉన్నాయి. ప్రాజెక్టు నిండుకుండలా ఉంది. ఇప్పటికీ ఎగువ ప్రాంతాల నుంచి 9,454 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, ఎస్కెప్ గేట్ల ద్వారా గోదావరిలోకి నీటి విడుదల కొనసాగుతోంది. ఖరీఫ్ సీజన్‌కు ప్రధాన కాలువల ద్వారా వారం రోజుల క్రితమే నీటి విడుదలను నిలిపి వేశారు. ఆలస్యంగా నాట్లు వేసిన సరస్వతి కాలువ ఆయకట్టుకు మాత్రమే 650 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. అయితే, ఖరీఫ్ చివరి వరకు ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టంతో ఉండటంతో యాసంగికి ఢోకా లేదనే భరోసా రైతుల్లో ఏర్పడింది.
వచ్చే నెల మొదటి వారంలో..
యాసంగి సీజన్‌లో భాగంగా డిసెంబర్ మొదటి వారంలో కాలువల ద్వారా ఆయకట్టుకు నీటి విడుదల చేసేందుకు ప్రాజెక్ట్ అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. గతంలో మాదిరిగా ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదల చేపడితే సకాలంలో పంటలు చేతికందుతాయి. ఎండలు మెండు కాకముందే ఏప్రిల్ నెలలోనే నీటి విడుదల నిలిపివేసేలా అధికారులు యోచిస్తున్నారు. ప్రాజెక్ట్‌లో డెడ్‌స్టోరేజీ 5 టీఎంసీలు, ఆవిరి రూపంలో 5 టీఎంసీలు, తాగునీటి అవసరాలకు 5 టీఎంసీలు పోను మిగిలిన నీటిని వదిలేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి నిల్వ 80.5 టీఎంసీలు కాగా అందులో నుంచి 15 టీఎంసీలు పోతే 65.5 టీఎంసీల నీటిని వదిలే అవకాశం ఉంది.
నిలకడగా ప్రాజెక్ట్ నీటిమట్టం
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో సమానంగా ఉండటంతో నీటిమట్టం నిలకడగా ఉంది. ఎస్కేప్ గేట్ల ద్వారా 8 వేలు, సరస్వతి కాలువ ద్వారా 650, తాగునీటి అవసరాలకు 231, ఆవిరి రూపంలో 573 క్యూసెక్కుల నీరు పోతోంది.


