దొడ్డుకు గడ్డు రోజులు | - | Sakshi
Sakshi News home page

దొడ్డుకు గడ్డు రోజులు

Nov 17 2025 10:19 AM | Updated on Nov 17 2025 10:19 AM

దొడ్డ

దొడ్డుకు గడ్డు రోజులు

మోర్తాడ్‌(బాల్కొండ): దొడ్డు రకం ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం చెబుతున్నా రైస్‌మిల్లర్లు సహకరించకపోవడంతో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు అవస్థలు పడుతున్నారు. ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 4,36,695 ఎకరాల్లో వరి సాగు చేయగా అందులో దాదాపు 50 వేల ఎకరాల వరకూ దొడ్డు రకాలు పండించారు. రైతులు దొడ్డు రకాలను కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించేందుకు అవకాశం ఉంది. దొడ్డు రకాలకు బోనస్‌ వర్తించకపోయినా ఈ రకం వరి సాగు చేస్తే దిగుబడి పెరగడంతోపాటు, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుంటుందనే ఉద్దేశంతో కొందరు రైతులు వీటినే సాగు చేశారు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 60 శాతం మేర ధాన్యం సేకరణ సాగినా దొడ్డు రకాలను కొనుగోలు చేయడంలో ఇబ్బందులు తప్పడం లేదు.

సన్నరకాలకే ప్రాధాన్యం

ధాన్యం అన్‌లోడింగ్‌ విషయంలో రైస్‌మిల్లర్లు సన్న రకాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రేషన్‌ వినియోగదారులకు సన్న రకాలనే పంపిణీ చేస్తుండటంతో మిల్లర్ల నుంచి ఈ రకం ధాన్యంనే సేకరిస్తున్నారు. దొడ్డు రకాలను భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ)కి కస్టమ్‌ మిల్లింగ్‌ కింద అందించాల్సి ఉంది. దొడ్డు రకాలను మిల్లింగ్‌ చేస్తే నూక శాతం ఎక్కువ వస్తుందనే కారణంతో మిల్లర్లు దొడ్డు రకాలను అన్‌లోడింగ్‌ చేసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. సన్న రకాలను వేగంగా అన్‌లోడింగ్‌ చేసుకుంటున్న మిల్లర్లు, దొడ్డు రకాలను దింపుకోవడానికి మూడు, నాలుగు రోజుల సమయం తీసుకుంటున్నారు. ఈ కారణంగా దొడ్డు రకాల ధాన్యం సేకరణకు తీవ్ర జాప్యం కలుగుతోంది.

మోర్తాడ్‌ మండలం తిమ్మాపూర్‌కు చెందిన రైతు మురళి తన ఐదు ఎకరాల్లో దొడ్డు వరి రకాలను సాగు చేయగా 120 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఆ ధాన్యాన్ని స్థానిక కొనుగోలు కేంద్రంలో పది రోజుల క్రితం తూకం వేయించాడు. లారీలు రాకపోవడంతో ధాన్యం తరలించే పరిస్థితి లేదు. ఇది ఒక్క రైతు మురళికి ఎదురైన ఇబ్బందే కాదు. వర్షాకాలం సీజన్‌లో దొడ్డు రకాలను సాగు చేసిన ఎంతో మంది ధాన్యం విక్రయించేందుకు గడ్డు పరిస్థితి ఎదురవుతోంది.

ప్రభుత్వం ఆదేశాలివ్వాలి

దొడ్డు రకాలను సాగు చేసిన రైతుల పట్ల ప్రభుత్వం దయ చూపాలి. ధాన్యం సేకరణ విషయంలో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి రైతులకు ఇబ్బందులను తప్పించాలి. ఏ రకం వరిని సాగు చేసినా ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి. – మాదాం నర్సయ్య, రైతు, తొర్తి

ఉన్నతాధికారులకు విన్నవించాం

దొడ్డు రకాలను సాగు చేసిన రైతుల నుంచి ధాన్యం సేకరిస్తున్నా అన్‌లోడింగ్‌కు ఇబ్బంది కలుగుతుంది. ఉన్నతాధికారులకు ఇదే విషయాన్ని వివరించాం. మిల్లర్లు ఆసక్తి చూపకపోవడం ఇబ్బందిగా మారింది. అధికారులు మిల్లర్లతో మాట్లాడుతున్నారు. సమస్య పరిష్కారమవుతుంది.

– కాశీరాం, సీఈవో, పీఏసీఎస్‌, మోర్తాడ్‌

కొనుగోలుకు ప్రభుత్వం

ఆదేశించినా ఆసక్తి చూపని మిల్లర్లు

ఇబ్బందుల్లో కొనుగోలు

కేంద్రాల నిర్వాహకులు

తూకం పూర్తయినా దొడ్డు రకం

ధాన్యాన్ని మిల్లులకు తరలించని వైనం

స్పష్టమైన ఆదేశాలివ్వాలని

రైతుల వేడుకోలు

దొడ్డుకు గడ్డు రోజులు 1
1/2

దొడ్డుకు గడ్డు రోజులు

దొడ్డుకు గడ్డు రోజులు 2
2/2

దొడ్డుకు గడ్డు రోజులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement