అంతర్రాష్ట్ర ట్రాన్స్‌ఫార్మర్ దొంగల ముఠా అరెస్టు
● ఎనిమిది మంది రిమాండ్
● రూ. 5.5 లక్షల నగదు, 40 కిలోల కాపర్‌కాయిల్స్ స్వాధీనం
● వివరాలు వెల్లడించిన సీపీ సాయిచైతన్య
నిజామాబాద్‌అర్బన్: ఏడాది నుంచి జిల్లాలోని వివిఽ ద ప్రాంతాల్లో ట్రాన్స్‌ఫార్మర్ కాయిల్స్ చోరీకి పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. కమిషనరేట్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ సాయిచైతన్య వివరాలు వెల్లడించారు. జిల్లాలోని ఇందల్వాయి, ధర్పల్లి, డిచ్‌పల్లి, జక్రాన్‌పల్లి, మెండోరా, ముప్కాల్, మెండోరా, మోపాల్, నవీపేట, వర్ని మండలాల్లో ఈ ముఠా ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసి అందులోని కాపర్ కాయిల్స్‌ను ఎత్తుకెళ్లిందన్నారు. ముఠాలోని ఏడుగురు సభ్యుల్లో ఐదుగురిని శనివారం ఇందల్వాయి వద్ద పట్టుకొని అరెస్టు చేశామన్నారు. కాపర్ కాయిల్స్ కొనుగోలు చేసిన ముగ్గురిని సైతం అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ ముఠా జిల్లాలోని 101 ట్రాన్స్‌ఫార్మర్లను పగులగొట్టి 40 కిలోల కాపర్ కాయిల్స్‌ను దొంగిలించారన్నారు. నిందితులు మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా దేశ్‌ముఖ్‌పోస్టు గ్రామానికి చెందిన తుంబారె సుధాకర్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం అమీర్‌నగర్‌లోని మర్బీర్‌శర్మ, ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా బారడిపేటకు చెందిన అలీ మహమ్మద్, ప్రకాశం జిల్లా బండెవెళ్లిగండ్ల గ్రామానికి చెందిన యాడాల వెంకటేశ్వర్లు, మహబూబ్‌నగర్ జిల్లా పెద్దాపురం గ్రామానికి చెందిన శానపల్లి రవీందర్, మేడ్చల్‌కు చెందిన అనిల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వలీ, మెదక్ జిల్లాలోని సంకలపల్లి గ్రామానికి చెందిన లింగప్ప, సిద్దిపేట జిల్లా కూరేళ్ల గ్రామానికి చెందిన గాజుల శ్రీశైలం, హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్ హైద ర్ అలీగా గుర్తించారు. నిందితుల నుంచి రూ.5.5 లక్షల నగదు, రెండు స్కూటీలు, ఆరు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసు విచారణలో కీలకంగా వ్యవహరించిన ఏసీపీ రాజావెంకట్‌రెడ్డి, డిచ్‌పల్లి సీఐ వినోద్, ఇందల్వాయి, డిచ్‌పల్లి, జక్రాన్‌పల్లి ఎస్సైలు సందీప్, షరీఫ్, మహేశ్, పోలీసు సిబ్బంది కిరణ్‌గౌడ్, ప్రశాంత్, సందీప్, కిశోర్, సుజిత్, నవీన్, సర్ధార్‌లను సీపీ అభినందించారు.


