చెరువులో పడి ఒకరి మృతి
జక్రాన్‌పల్లి: మండలంలోని అర్గుల్ గ్రామంలోగల చెరువులో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు పడిపోయి మృతిచెందాడు. ఎస్సై మహేష్‌కుమార్ తెలిపిన వివరాలు ఇలా..డిచ్‌పల్లి మండలంలోని నడిపల్లి గ్రామానికి చెందిన తీట్ల ప్రభాకర్ (50) అనే వ్యక్తి ఆదివారం అర్గుల్ చెరువులో గాలం వేసి చేపలు పడుతున్నాడు. ఈక్రమంలో చెరువు నీటిలో గాలం తట్టుకోవడంతో దానిని తీయడానికి నీటిలోకి దిగాడు. లోతు ఎక్కువగా ఉండడంతో కాళ్లకు గడ్డి చుట్టుకోవడంతో బయటకు రాలేక ఊపిరాడక ప్రభాకర్ మృతి చెందాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటన స్థలానికి ఎస్సై తన సిబ్బందితో వెళ్లి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


