ఆర్వోబీ వద్ద ఆగమాగం
● గంటపాటు ట్రాఫిక్ జామ్
● ఎక్కడికక్కడ నిలిచిపోయిన
వాహనాలు
నిజామాబాద్ రూరల్ : నగర శివారులోని మాధవనగర్ ఆర్వోబీ రైల్వే బ్రిడ్జి వద్ద సోమవారం సాయంత్రం ఆరు గంటలకు సుమారు గంటపాటు ట్రాఫిక్‌జామ్ అయ్యింది. రోడ్డు అధ్వానంగా ఉండడంతోపాటు కనీసం అక్కడ విద్యుత్ దీపాలు లేకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైల్వే గేటు రెండుసార్లు దించి ఎత్తడంతో రోడ్డుకు ఇరువైపులా అర కిలోమీటరు వరకు వాహనాలు నిలిచిపోయాయి. అసలు ట్రాఫిక్‌ను క్లియర్ చేసే వారు లేకపోవడంతో ఎవరికి వారే ఇష్టారీతిన వాహనాలను ముందుకు తీయడంతో సమస్య తీవ్రమైంది. హైదరాబాద్ వైపు వెళ్లే వాహనదారులతోపాటు స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నా పట్టించుకునే వారు లేకుండాపోయారు. సంబంధిత అధికారులు స్పందించి రోడ్లపై గుంతలను పూడ్చడంతోపాటు ఆర్వోబీ వద్ద ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
