కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలి
మాక్లూర్: రైతులను ఇబ్బంది పెట్టకుండా ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్‌తో కలిసి మాక్లూర్‌లో కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక రైతులతో సమావేశమై మాట్లాడారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. వాతావరణ మార్పులతో వర్షాలు కురుస్తున్నాయని, దీంతో రైతులు ఆరబెట్టిన ధాన్యాన్ని మళ్లీ ఆరబెట్టుకునే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఫలితంగా రైతులకు టార్పాలిన్లు, కూలీల ఖర్చు తడిసిమోపెడవుతుందని తెలిపారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఆరిన ధాన్యం ఆరినట్టు కొనుగోలు చేయాలన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలలో ఇబ్బందులుంటే తన దృష్టికి తేవాలని రైతులకు సూచించారు. తడిసిన ధాన్యం కొనుగోలు విషయమై రైతులు ఆందోళన చెందొద్దని తెలిపారు. జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు రైస్‌మిల్లర్లతో మాట్లాడుతూ సమయానికి గన్నీ బ్యాగులు, లారీలను పంపిస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీసీవో శ్రీనివాస్‌రావు, సివిల్ సప్లయ్ డీఎం శ్రీకాంత్‌రెడ్డి, డీఎస్‌వో అర్వింద్‌రెడ్డి, జేడీఏ గోవింద్‌నాయక్, తహసీల్దార్ శేఖర్, ఏవో పద్మ, మాక్లూర్ సొసైటీ ప్రత్యేక అధికారి స్వప్న, కాంగ్రెస్ మండల నాయకులు గంగాధర్‌గౌడ్, రవిప్రకాశ్, వెంకటేశ్వర్‌రావు, సొసైటీ మాజీ చైర్మన్లు బూరోల్ల అశోక్, దయాకర్‌రావు, మాజీ సర్పంచులు రాజేందర్, రాజ్‌మల్లయ్య, మాజీ జెడ్పీటీసీ జంగిడి సతీశ్, పీర్‌సింగ్, మోతే రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
