బకాయిలు చెల్లించే వరకు కాలేజీలను తెరవం
● ప్రయివేటు కళాశాలల
అసోసియేషన్ వెల్లడి
ఖలీల్‌వాడి:ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పూర్తిగా చెల్లించే వరకు కాలేజీలను తెరిచే ప్రసక్తి లేదని టీయూ ప్రయివేటు కాలేజీల అసోసియేషన్ అధ్యక్షుడు జైపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని కేర్ డిగ్రీ కళాశాలలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం ఒక ఏడాది ఫీజులను మరో సంవత్సరం చెల్లించడంతో చాలా ఇబ్బందులుపడ్డామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకంతో విద్యార్థులకు నాణ్యమైన విద్యను ఉచితంగా అందించామని, అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావొస్తున్నా పాత బిల్లులు ఇప్పటి వరకు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు బకాయిలపై ప్రభుత్వానికి ఎన్నోసార్లు అభ్యర్థించామని గుర్తుచేశారు. గతంలో కాలేజీలు బంద్ చేయడంతో యాజమాన్యాలతో ప్రభుత్వం మాట్లాడి బకాయిలను చెల్లిస్తామని హామీ ఇచ్చిందన్నారు. కానీ, ఇంత వరకు బకాయిల్లో నుంచి కనీసం 10 శాతం కూడా చెల్లించలేదని తెలిపారు.కాలేజీల నిర్వహణ కోసం రుణా లు,బంగారు నగలు తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో అసోసియేషన్ కార్యదర్శి నరాల సుధాకర్, మార య్య గౌడ్, దాసరి శంకర్, సూర్య ప్రకాశ్, దత్తు శ్రీనివాస్, బాలకృష్ణ, శంకర్, నరేశ్ పాల్గొన్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
