చోరీ కేసులో ఇద్దరి అరెస్టు
నిజామాబాద్‌అర్బన్: చోరీ చేసిన సొత్తును విక్రయించడానికి వచ్చిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఒకటో టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపారు. వివరాలు ఇలా..నగరంలోని కొజా కాలనీకి చెందిన అతర్ బేగ్,షేక్ అజ్మద్ అనే ఇద్దరు గత కొంతకాలంగా దొంగతనాలకు పాల్పడుతుండేవారు. అక్టోబర్ 31న నగరంలోని అశోక్ నగర్‌లోగల ఓ ఇంటిలో రూ.1500 నగదు, ఒక సెల్‌ఫోను, బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. కాగా ఆదివారం గంజ్ ప్రాంతంలో బంగారం విక్రయించేందుకు రాగా అనుమానం వచ్చి వారిని పోలీసులు విచారించారు. దీంతో వారు చోరీ చేసినట్లు అంగీకరించారు. అనంతరం వారివద్దనుంచి చోరీ సొత్తును రికవరీ చేసి, వారిని అరెస్టు చేశారు. వారిలో అతర్‌బేగ్ నెలన్నర క్రితమే జైలు నుంచి విడుదలయ్యాడని, మళ్లీ చోరీ కేసులో అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు,
బోధన్ పట్టణంలో ఇద్దరు..
బోధన్‌టౌన్(బోధన్): ద్విచక్ర వాహనాలు చోరీకి పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పట్టణ సీఐ వెంకట నారాయణ తెలిపారు. వివరాలు ఇలా.. పట్టణంలోని అంబేడ్క ర్ చౌరస్తాలో ఎస్‌ఐ హబీబ్‌ఖాన్, మనోజ్ సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా బైక్‌పై వస్తున్న ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోవడానికి యత్నించారు. పోలీసులు వెంటనే వారిని వెంబడించి పట్టుకొని, విచారించారు. వారిని నిజామాద్‌కు చెందిన షేక్ మహ్మద్ జాహెద్, బోధన్‌కు చెందిన సయ్యద్ ఇక్బాల్‌గా గుర్తించారు. ఇద్దరు కలిసి బోధన్, ఆర్మూర్ ప్రాంతాల్లో బైక్‌లను చోరీ చేసి, నకిలీ ధ్రువపత్రాలు తయారు చేసి, బైక్‌లను మహారాష్ట్రలో అమ్ముతున్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి బుల్లెట్, పల్సర్‌తో పాటు నఖిలీ ఆర్సీలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వారిని రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.


