వర్ష ప్రభావం.. వరి కోతలకు భారం..
అద్దె భారం తప్పడం లేదు..
● వర్షాలకు నేలవాలిన పొలాల్లో
టైర్ యంత్రాలు వెళ్లలేని పరిస్థితి
● చైన్ యంత్రాలకు ఎక్కువ అద్దెలతో ఇబ్బందులు పడుతున్న రైతులు
మోర్తాడ్(బాల్కొండ): ఇటీవల కురిసిన వర్షాల కారణంగా వరి పంట నేలకూలింది. పంట కోతలకు రావడంతో రైతులు కోత యంత్రాలను ఆశ్రయిస్తున్నారు. పంట నేలవాలడంతో టైర్ యంత్రాలు పొలాల్లోకి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో చైన్ యంత్రాల వైపు రైతులు మొగ్గుచూపడంతో వాటికి డిమాండ్ ఏర్పడింది. కానీ వాటి అద్దె భారం ఎక్కువగా ఉండటంతో అన్నదాతలు మోయలేకపోతున్నారు. టైర్ యంత్రాలకు అద్దె ఒక గంటకు రూ.1,540గా, చైన్ యంత్రాలకు మాత్రం గంటకు రూ.2,950 చెల్లించాలని గతంలోనే తీర్మానించారు. టైర్ యంత్రాలతో వేగంగా వరి కోతలు పూర్తి చేయడానికి అవకాశం ఉంది. చైన్ యంత్రాలతో వరి కోతలు పూర్తి చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. అద్దె ఎక్కువగానే ఉండటం, వరి కోతలకు సమయం ఎక్కువ తీసుకుంటుండటంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. వర్ష ప్రభావం వరి కోతలపై ఆర్థిక భారం మోపడంతో రైతులు విలవిల్లాడిపోతున్నారు. వరి కోతలు సకాలంలో పూర్తి చేయకపోతే వాతావరణ పరిస్థితులలో మార్పులు వచ్చి మరింత నష్టం వాటిల్లుతుందేమోననే సందేహం రైతులను వెంటాడుతుంది. ఏదేమైనా వర్ష ప్రభావం వల్ల వరి కోతల కోసం ఆర్థిక భారం అధికంగా మోయాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు.
సాధారణ యంత్రాలతో వరి కోతలు పూర్తి చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ వరి కోతల సమయంలో వర్షాల వల్ల పంట నేలకూలడంతో చైన్ యంత్రాలను వినియోగించాల్సి వస్తుంది. రైతులకు గత్యంతరం లేకపోవడంతో వాటి అద్దె భారం మోయక తప్పడం లేదు.
– కే. చిన్న రాజేశ్వర్, రైతు, మోర్తాడ్
వర్ష ప్రభావం.. వరి కోతలకు భారం..


