కళాశాలల నిరవధిక బంద్
ఖలీల్‌వాడి/డిచ్‌పల్లి : ప్రభుత్వం ఫీజు రియంబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలలను యాజమాన్యాలు బంద్ పాటిస్తున్నాయి. తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల మేనేజ్‌మెంట్ అసోసియేషన్ పిలుపు మేరకు సోమవారం కళాశాలల ఎదుట బంద్ బ్యానర్లు ఏర్పాటు చేశారు. కళాశాలలు మూసి ఉంచడంతో విద్యార్థులు వెనుదిరిగి వెళ్లిపోయారు. ఉమ్మడి జిల్లాలో 50 డిగ్రీ, 11 పీజీ కాలేజీలు ఉండగా, సుమారు రూ.350 కోట్ల ఫీజు బకాయిలు రావాల్సి ఉంది. అలాగే నిజామాబాద్ జిల్లాలోని 14 బీఈడీ, ఒక బీపెడ్, మూడు ఇంజినీరింగ్ కళాశాలలను సైతం యాజమాన్యాలు మూసివేశాయి. మూడు ఇంజినీరింగ్ కళాశాలలకు సుమారు రూ.20 కోట్ల వరకు బకాయిలు విడుదల కావాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం గత మూడు సంవత్సరాలుగా ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో కళాశాలలు నిర్వహించలేని స్ధితిలో ఉన్నామని కళాశాలల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం బకాయిలు విడుదల చేసే వరకు కళాశాలలను తెరిచే ప్రసక్తే లేదని వారు స్పష్టం చేస్తున్నారు. కళాశాలల నిరవధిక బంద్ కొనసాగితే సిలబస్ విషయంలో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఫీజు బకాయిలు విడుదల
చేయాలని నిరసన
జిల్లాలో మూతపడిన
ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలలు
కాలేజీల ఎదుట బ్యానర్ల ఏర్పాటు

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
